Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఫార్మాసిస్టుల సమావేశంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫార్మసీ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ఫార్మాసిస్టుల సమావేశం డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో రాష్ట్ర ఫార్మాసిస్టులు సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలనీ, జిల్లాకు రెండు చొప్పున 33 జిల్లాలకు 66 మంది ఫార్మసీ ఇన్స్పెక్టర్లను నియమించాలనీ, ఖాళీగా ఉన్న 13 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిస్టులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలనీ, ఫార్మసీని స్థాపించడానికి రూ.ఐదు లక్షలు, ఫార్మాస్యూటికల్ కంపెనీ స్థాపనకు రూ.ఒక కోటి రుణం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే ఫార్మాసిస్టులకు పదోన్నతులు కల్పించాలనీ, ఫార్మసీ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలనీ, ఫార్మసీ చట్టం 1948, ఔషధ చట్టం 1940ను కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫార్మా సొసైటీ అధ్యక్షులు అకుల సంజరు రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ నాయకులు చంద్రశేఖర్ ఆజాద్, గవర్నమెంట్ ఫార్మాసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వీరారెడ్డి, ఉపాధ్యక్షులు తిరుమల్ రావు, సొసైటీ కార్యదర్శి సాకేత్, ఫార్మ్.డి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.