Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షర్మిల ప్రజాప్రస్థానంలో భాగంగా మాట ముచ్చట..
నవతెలంగాణ -రామన్నపేట
గాడిదకు తెల్ల రంగు పూసి అది ఆవు అని ప్రజలను నమ్మించే మోసగాడు కెేసీిఆర్ అని వైఎస్సార్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మాట ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే.. పాలకులు మాత్రం సమస్యలే లేవంటున్నారని ఆరోపించారు. సమస్యలు వినడానికి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, ప్రశ్నించడానికి వైఎస్సార్ టీపీ ఆవిర్భవించిందన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి ఆయన బిడ్డగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, మాట తప్పను మడమ తిప్పనని చెప్పారు. ''డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారా.. కొత్త పెన్షన్లు వస్తున్నాయా.. 3 ఎకరాల భూమి ఇచ్చారా.. దళితులందరికీ రూ.10 లక్షలు వచ్చాయా... రుణమాఫీ అయిందా'' అని సభలోని వారిని అడగగా లేదని సభికులు ముక్తకంఠంతో జవాబిచ్చారు. ఇదే కేసీఆర్ పాలన అని ఎద్దేవా చేశారు. రైతులకు రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేలు ఇస్తూ సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీలన్నీ ఎత్తివేశారని ఆరోపించారు. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు వృద్ధులుంటే ఒక్కరికే పింఛన్ ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు ఏమి చేయలేదని, అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఏపూరి సోమన్న, కొమ్ము శోభ, బత్తుల మల్లేశం నాయకులు తదితరులు ఉన్నారు.