Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గుతున్న కుసుమ సాగు
- గొప్ప ఔషధ గుణాలు కలిగిన పంటగా పేరు
- ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే మరింత సాగు
నవతెలంగాణ-జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం.. ఆరుతడి పంటల సాగుకు ప్రసిద్ది. ఇక్కడ నీటి సౌకర్యం లేకపోవడంతో స్థానిక రైతులు ఆరుతడి పంటలు విరివిగా సాగు చేస్తుంటారు. వాటిలో కూడా కుసుమలను స్థానిక రైతులు విరివిరిగా పండిస్తుంటారు. ఎన్నో ఔషధగుణాలున్న కుసుమ పంట ఉత్పత్తులకు డిమాండ్ ఉన్నా.. పంటకు మాత్రం మార్కెటింగ్ సౌకర్యం లేదు. దాంతో రైతులు వెనకడుగు వేస్తుండటంతో.. గతంలో వేలాది ఎకరాల్లో సాగవుతున్న పంట.. ప్రస్తుతం వందలకు చేరింది. జుక్కల్ మండలవ్యాప్తంగా సుమారు 400 ఎకరాల్లో సాగవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం స్పందించి కుసుమ సాగు చేసే రైతులకు ప్రోత్సాహం ఇచ్చి మార్కెట్ సౌకర్యం కల్పిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.
అడవి మృగాల నుంచి పంటలకు రక్షణగా కుసుమ పంటను పంటల చుట్టూ రెండు, మూడు సాళ్లు విత్తుకుంటారు. కుసుమ పంటకు కాండం నుంచి ఆకులపైనా.. మొక్కంతా ముండ్లతో ఉంటుంది కాబట్టి అడవి మృగాలు పంటచేళ్ల లోనికి రాకుండా ఈ పంట రక్షణగా పనిచేస్తుంది. లేత వయస్సులో కుసుమ ఆకులతో కూరను సైతం వండుకుంటారు. పూర్వకాలం నుంచి ఈ ప్రాంతంలో ఆకు కూరగా పంట లేతగా ఉన్నప్పుడు సీజనల్లో వండుకుంటున్నారు. అంగట్లో సైతం అమ్ముతున్నారు. వీటిలో పలు రకాల పోషక విలువలు ఉండటంతో పాటు గుండె సంబంధిత వ్యాధులున్న వారు ఎక్కువగా వినియోగించడం దీని ప్రత్యేకత.
మార్కెట్ లేదు.. ధర ఇవ్వరు
ఆయుర్వేద మందుల తయారీ, ఇతరాత్ర మందుల్లో కుసుమ పంటలను ఉపయోగిస్తున్నా.. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. పంట సాగు చేసి అమ్మేందుకు తీసుకెళ్తే.. తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కుసుమ నూనె ధర కిలోకు రూ.300 నుంచి 400 పలుకుతుంది. కానీ పంటను కొనుగోలు చేసే వారు లేరు. దాంతో ఇక్కడి రైతులు పంటను విక్రయించేందుకు మహారాష్ట్రలోని దెగ్లూర్, ఉద్గీర్ మార్కెట్లకు తరలిస్తున్నారు. అక్కడ సైతం క్వింటాకు రూ.2500 నుంచి రూ.3000 వరకు ధర మాత్రమే చెల్లిస్తున్నారు. కుసుమపంట ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చీడపురుగుల బెడద ఉండదు. తెగుళ్లు వస్తే వ్వవసాయాధికారుల సూచనలు పాటిస్తే మంచి దిగుబడి వస్తుంది.
దిగుబడి వచ్చింది..
కొనేవారు లేరు
కౌలు తీసుకున్న రెండెకరాల్లో కుసుమ పంట వేసిన. పంట దిగుబడి బాగా వచ్చింది. కానీ కొనేవారు లేరు. దళారులేమో రేట్లు లేవని సాకులు చెప్పి తక్కువ ధరకు అడుగుతున్నారు.ఇంటి అవసరం కోసం కుసుమ నూనెను వంటల్లో వాడుకునేందుకు కొంత గానుగ పట్టించాను.మిగతాది అమ్మడానికి ప్రయత్నిస్తున్నాను. జుక్కల్,మద్నూర్ యార్డులలో మార్కెటింగ్ సౌకర్యం లేదు. మహారాష్ట్రలోని దెగ్లూర్,ఉద్గిర్కు తీసుకెళ్తున్నాం.
- మారుతి గొండ. రైతు చిన్నఎడ్గి. జుక్కల్