Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలాంటి నివారణా చర్యలు చేపట్టకుండా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. వ్యవసాయ పెట్టుబడుల మీద 50 శాతం ఖర్చుకు రైతులకు మద్దతు ధర ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో గాలికొదిలేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ధరణి భూమి సమస్యలు, రైతుబంధు, పోడు భూమి సమస్యలు.. తదితర భూసంబంధమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఐతరాజు నరసింహ, కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.