Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులో పడి తాత, కొడుకు, మనువడు మృతి
- కన్నీరుమున్నీరైన రైతు కుటుంబం
- చిన్న గిరిజాలలో విషాదం.. ఎమ్మెల్యే పెద్ది పరామర్శ
నవతెలంగాణ-నర్సంపేట
మృత్యువులోనూ ఆ కుటుంబ బంధం వీడలేదు. తాత, కొడుకు, మనువడు ఒకే ప్రమాదంలో మృత్యువాతకు గురైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి(55), అతని కుమారుడు నాగరాజు(30), మనువడు లక్కీ (15) కుటుంబ సభ్యులు కలిసి చేను వద్దకు వెళ్లారు. కోసిన మొక్కజొన్నను సంచుల్లో నింపారు. పనులు ముగిశాక కృష్ణమూర్తి తన మనువళ్లను తీసుకొని చేను సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి స్నానాలు చేయించాడు. ఈ క్రమంలో చెరువు గట్టు నుంచి మనువడు లక్కీ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. మనువడిని రక్షించే ప్రయత్నంలో కృష్ణమూర్తి నీళ్లలో మునిగాడు. సమీపంలోనే ఉన్న నాగరాజు గుర్తించి హుటాహుటిన చెరువులోకి దూకాడు. వీరిద్దరిని కాపాడే ప్రయత్నంలో అతనూ నీటిలో మునిగాడు. చెరువులోని గుంతలో ఈ ముగ్గురు చిక్కుకుపోయారు. చేను వద్ద ఉన్న మిగతా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నున్న రైతులు చేరుకొని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చెరువులోని గుంతలో మునిగిన ఈ ముగ్గురు చివరకు మృతిచెందారు. కొంతసేపటికి గ్రామస్తులు మృతదేహాలను వెలికితీశారు. ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు ఒకేసారి మృతి చెందడంతో కృష్ణమూర్తి భార్య విజయ, నాగరాజు భార్య సంధ్య, కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను చలింపజేసింది. చెరువులో లోతుగా పెద్దపెద్ద గుంతలు తీసి ఉన్నందున ఈ ప్రమాద ఘటనకు కారణమైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు దుగ్గొండి మండల పరిధిలోకి వస్తున్నందున ఈ ఘటనపై దుగ్గొండి పోలీసులు శవపంచనామా చేసుకొని కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే పరామర్శ..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హుటాహుటిన చేరుకున్నారు. చెరువు వద్ద వెలికితీసిన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మూడు తరాలకు చెందిన ముగ్గురూ మృతిచెందడం అత్యంత విషాధకరమని ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నామాల సత్యనారాయణ, ఎంపీటీసీ బండారి శ్రీలత, న్యాయవాది మోటూరి రవి, చిన్న గురిజాల సర్పంచ్ గడ్డం సుజాత, తుత్తురు కోమల తదితరులన్నారు.