Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాటల్లో జాతీయత, ఆచరణలో విధ్వంసకర విధానాలు
- 28, 29న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి :సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
కార్మికవర్గం పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నదన్నారు. మాటల్లో జాతీయత, దేశభక్తి గురించి ఊదరగొడుతూ, ఆచరణలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధ్వంసకర విధానాలను సాగిస్తున్నదని విమర్శించారు. దేశ రక్షణ కోసం ఈ నెల 28, 29న జరిగే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్క్‌షాప్‌లో పాలడుగు భాస్కర్‌తో పాటు బీడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. 'నేషనల్ డీ మానిటైజేషన్' పేరుతో ఇప్పటికే విమానాశ్రయాలు, రైల్వేలు, బొగ్గు గనులు, బ్యాంకులు, జీవిత బీమా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిచ్చిందని తెలిపారు. కార్మికవర్గం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చడమే కాకుండా, విద్యుత్ సవరణ చట్టం 2020 పేరుతో విద్యుత్ పంపిణీని ప్రయివేటీకరించే యత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి విధ్వంసకరమైన విధానాలను దేశ కార్మికవర్గం వ్యతిరేకిస్తూ 21వ సారి సమ్మె శంఖారావం పూరించిందని తెలిపారు. 10 కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో 'ప్రజలను రక్షించండి - దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఇచ్చిన రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సంపూర్ణంగా జయప్రదం చేయాలని కార్మికులను కోరారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రమణ, సీఐటీయూ కామారెడ్డి జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.