Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక, సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాలు :
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
- చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ- భువనగిరిరూరల్/ఆలేరు రూరల్
దేశవ్యాప్తంగా ఉన్న మార్క్సిస్టు పార్టీ కార్యాలయాలన్నీ.. ప్రజా పోరాటాలకు కేంద్రంగానే కాకుండా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో ఆ పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం కోసం చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) దేశ, రాష్ట్రవ్యాప్తంగా కూలి, భూమి, ఉపాధి, సబ్బండ వర్గాల సమస్యల పరిష్కారం కోసం అనేక సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని మనువాద సిద్ధాంతాన్ని తెచ్చి కులం, మతం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేస్తూ గుండుగుత్తగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజలపై అనేక భారాలు మోపుతోందని విమర్శించారు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్య మానవుడు ఒక్క పూట తిండి తినలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధిహామీ, కార్మిక, అటవీ హక్కుల చట్టాలు లేకుండా చేయాలని కుట్రలు చేస్తోందన్నారు. ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామంలో నిర్మాణం చేస్తున్న కార్యాలయం అన్ని వర్గాల ప్రజలు తమ సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, గ్రామ సర్పంచ్ ఎదునూరి ప్రేమలత మల్లేష్, కమిటీ సభ్యులు జిట్టా అంజిరెడ్డి, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్, స్థల దాత కడారి రాజమల్లు, సీనియర్ నాయకులు జహంగీర్, జూపల్లి సత్తయ్య, గ్రామశాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల ఆశయాలను సాదిద్దాం
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన గ్యార బాలయ్య ఆశయాల సాధన కోసం పాటుపడాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన బాలయ్య స్థూపావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పటేల్‌గూడెం, శ్రీనివాస్ పురం గ్రామానికి 15 ఏండ్లు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి బాలయ్య అన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని మండల కమిటీ 17 అడుగుల స్థూపం ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ , జిల్లా కమిటీ సభ్యులు బాలరాజు, ఎక్బాల్, గ్రామ సర్పంచ్ పులగం పద్మా యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.