Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
- ప్రజారోగ్య పరిరక్షణ ఉద్యమంలో వెన్నంటి ఉంటా...
- సీఎంతో సహా ప్రజా ప్రతినిధులందరూ ప్రభుత్వాస్పత్రికే వెళ్లాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమని చెబుతున్న ఆరోగ్యశ్రీ పథకాలు రెండూ ప్రయివేటుకు లాభం చేకూర్చేందుకే ఉపయోగపడుతున్నాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీ పథకం ... నా పథకం అనేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. కేంద్రం వైద్యానికి గ్రాంటు రాష్ట్రానికి గ్రాంటు ఇవ్వాలని సూచించారు. విద్య, వైద్యాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగిస్తేనే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రయివేటు ఆస్పత్రులు సేవలందించేందుకు నిరాకరిస్తే ప్రజల ప్రాణాలను కాపాడింది ప్రభుత్వాస్పత్రులేనని గుర్తుచేశారు. ప్రభుత్వాస్పత్రుల డాక్టర్లు కరోనా నుంచే కాక కరోనా భయం నుంచి ప్రాణాలను కాపాడారనీ, లేకుంటే ఇంకా అనేక మంది ప్రజల చనిపోయే వారని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్యసంఘాలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ డిమాండ్ల సాధన కోసం శాసనమండలిలో, బయట ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన వంతుగా ప్రయత్నిస్తాననీ హామీ ఇచ్చారు.
ఆదివారం హెల్త్ రిఫార్స్మ్ డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ డాక్టర్స్ ఫోరం, కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్, టీఇఏ - డాక్టర్స్ ఫోరం, తెలంగాణ స్టేట్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, ప్రొగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం, నర్సింగ్ అసోసియేషన్, పారామెడికల్ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రజారోగ్య పరిరక్షణ సభ జరిగింది. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రజా ప్రతినిధులందరు ప్రభుత్వాస్పత్రులోనే చికిత్స తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్య, వైద్యం అత్యధికంగా ప్రయివేటు రంగంలో ఉన్నది తెలంగాణలోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల తాను క్షేత్రస్థాయిలో పర్యటించాననీ, అనేక చోట్ల డాక్టర్లు, నర్సుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. బస్తీ దవాఖానాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. పెరిగిన జనాభాకు తగినట్టు యూపీహెచ్సీల సంఖ్య పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను కనీసం 1,100కు పెంచాలనీ, ఒక్కో కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఆరు నుంచి ఏడు మంది నర్సులు, ఇతర సిబ్బందితో నడిపించాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని వెంటనే నిర్మించాలన్నారు. వైద్యారోగ్యశాఖ నిధులను బడ్జెట్లో ఎనిమిది శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన డాక్టర్లను మెడికల్ కాలేజీల్లో వాడుకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మెడికల్ కాలేజీలకు ప్రొఫెసర్లు దొరికే పరిస్థితి లేదనీ, నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలను కాపాడిన తాత్కాలిక, ఇతర సిబ్బందిని యధావిథిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తనకు అవకాశమొస్తే డాక్టర్ల వేతనాలను పెంచుతానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రయివేటు ఆస్పత్రుల పాత్రను గణనీయంగా తగ్గించి ప్రభుత్వాస్పత్రులను పెంచాలని డిమాండ్ చేశారు. డీఎంఇ, డీహెచ్ స్థానాల్లో ఇన్ఛార్జీలను కొనసాగించడం సరికాదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ తదితర పథకాలకు నిదులిచ్చిన వాడుకోలేని స్థితిలో రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారుందని విమర్శించారు. లొసుగులు బయటపెట్టకూడదనే డీఎంఇగా డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని కొనసాగిస్తున్నారనీ, అదే విధంగా అవినీతి ఆరోపణలో విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ డీహెచ్గా డాక్టర్ జి.శ్రీనివాసరావును కొనసాగిస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు అడ్వకేట్ మహ్మద్ సాధిక్ అలీ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అవసరమైతే దీనిపై పిటీషన్ వేస్తానని హెచ్చరించారు. మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ బి.రమేశ్ మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే వైద్యానికి అతి తక్కువగా ఖర్చు పెడుతున్న దేశం భారతదేశమని విమర్శించారు. అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందేలా తక్కువ ఖర్చుతో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబురావు, నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ జి.శ్రీనివాస్, హెచ్ఆర్డీఏ అధ్యలు డాక్టర్ కె.మహేష్, తెలంగామ జుడా అధ్యక్షులు డాక్టర్ సాగర్, నాయకులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ వంశీ, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంపత్ రావు, నాయకులు డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ దీన్ దయాళ్ సింగ్, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డాక్టర్స్ ఫోరం నాయకులు డాక్టర్ పురుషోత్తం పాల్గొన్నారు.