Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ విహంగం లేక వలస పక్షుల కేంద్రం వెలవెల
- సైబిరియన్ అతిథి లేక చిన్నబోయిన చింతపల్లి
- కోతుల బెడదతో చెట్లు కొడితే 'కొంగమ్మ'కు తిప్పలు
- గూడుకు చోటు లేక ఊరంతా తిరిగివెళ్తున్న పైలట్లు
- 150 ఏండ్లలో మూడోసారి ఆ ఊరుకు రాని కొంగ
కోతుల బెంగ కొంగకు తిప్పలు తెచ్చిపెట్టింది. ఊళ్లో...చేలలో ఉన్న చింతచెట్లతో పాటు భారీ వృక్షాలను నరికి వేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖమ్మం జిల్లాలోని విదేశీ వలస పక్షుల కేంద్రం చింతపల్లి వెలవెలబోతోంది. జనవరి నుంచి జూలై వరకు ఇక్కడే కాపురం చేసే సైబిరియన్ చుట్టాలు గూడుపెట్టే చోటు లేక గుండె చెదిరి వెళ్తున్నాయి.
(చింతపల్లి నుంచి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి)
గాలిలో ఈదుకుంటూ...గంగపై ఉరుకుతుండే కొంగమ్మ వేల కిలోమీటర్లు పయనించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 14 కి.మీ దూరంలోని ఖమ్మం రూరల్ మండలం చింతపల్లికి చేరుతుంటాయి. ప్రతియేటా డిసెంబర్ నుంచి పైలట్ కొంగలు వచ్చి ఊరు ఊరంతా చుట్టి వెళ్తాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో అధ్యయనం చేస్తాయి. అంతా సవ్యంగా ఉందనుకుంటే జనవరిలో సైబిరియా నుంచి తోటి కొంగలను తోడ్కొని వస్తాయి. ఎర్రటి కాళ్లు..పొడవాటి ముక్కు... ఐదు నుంచి పది కిలోల పరిమాణం... ఆకర్షనీయమైన రూపంతో ఉండే ఈ కొంగ బంధు గణాన్ని ఒకప్పుడు గ్రామస్తులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించే వారు... అల్లారుముద్దుగా చూసుకునే వారు. ఎవరైనా హాని చేయాలని ప్రయత్నిస్తే రూ.500 జరిమానా కూడా వేసేవారు. సుమారు 150 ఏళ్ల నుంచి కొంగలు జంటగా రావడం...జూన్, జూలైలో పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వెళ్లడం ఆనవాయితీ. కొంగలున్నన్ని రోజులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే సందర్శకులతో ఊళ్లో సందడి నెలకొనేది. కానీ కొంతకాలంగా వానర సేన దండయాత్ర చేస్తోంది. గ్రామస్తులు కోతులతో వేగలేక ఇంటికి ఒకటి, రెండుగా ఉన్న చింత, వేప, ఇతరత్ర చెట్లను నరికి వేస్తున్నారు. కోతులను పారదోలేందుకు టపాసులు పేల్చుతున్నారు. ఈ శబ్దం తాకిడికి పక్షులు సైతం చెల్లాచెదురవుతున్నాయి. గూట్లో ఉన్న కొంగ పిల్లల గుండెలదురుతున్నాయి. భయాందోళనతో చెట్ల పైనుంచి కిందపడి చనిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుడ్లను కోతులు భక్షిస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కోతి చేష్టల ముందు కొంగమ్మ తలవంచక..., గూడు చెదిరి గుడ్డు నేలపాలు కాక తప్పట్లేదు. ఈ పరిణామాలతో భీతిల్లిన సైబిరియన్ కొంగలు పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాయి. తమకు ఎదురవుతున్న గడ్డు స్థితిగతులపై ఆందోళన చెందుతున్నట్లున్నాయి. ఈ ఊళ్లో అడుగుపెట్టలేక పొరుగూళ్ల కోసం అన్వేషిస్తున్నాయి.
ఇలా మూడోసారి...
సైబిరియన్ కొంగలకు ఇప్పటికీ దాదాపు 150 ఏళ్లుగా చింతపల్లి ఆశ్రయం ఇస్తోంది. ఇన్నేళ్లలో ఆ ఊరుకు కొంగలు రాని సందర్భాలు మూడు, నాలుగు సార్లకు మించ లేదు. కరువు కాటకాలు సంభవిస్తున్న సమయంలో తప్ప గ్రామంలోకి 'అతిథులు' అడుగుపెట్టని సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు కేవలం కోతుల కారణంగా కొంగలు రాని పరిస్థితి దాపురించింది. జనవరిలో రావాల్సిన విహంగాలు మూడునెలలైనా రాకపోవడంతో చింతిస్తున్నారు. గతేడాది మంకీ క్యాచర్స్ ద్వారా కోతులను పట్టించేందుకు అటవీశాఖ అధికారులు పయ్రత్నించినా అదీ విఫలయత్నమే అయింది. ఖమ్మం జిల్లాలో కోతుల బెడద ఎంత తీవ్రంగా ఉందో తెలిపేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సందర్శకులకు కొంగలను చూపించి ఆనందానుభూతి నింపేందుకు అటవీశాఖ ఓ గైడ్ను సైతం ఏర్పాటు చేసింది. కోతులతో కొంగలు రాకపోవడంతో ఈ వలస పక్షి కేంద్రం వృథాగా మిగిలి ఉంది. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 2.50 లక్షలకు పైగా కోతులున్నాయి. 2,000 పైగా కోతుల సమూహాలుండగా వీటిలో ఖమ్మం రూరల్లోనే 138 వరకు ఉన్నాయి. 11వేలకు పైగా కోతులు మండలంలో సంచరిస్తుండగా చింతపల్లిలో సుమారు 1500 వరకు ఉన్నట్లు అంచనా. ఫలితంగానే వలస పక్షుల కేంద్రం ఈ ఏడాది కొంగలు లేక బెంగటిల్లినట్లు స్థానికులు చెబుతున్నారు.
కొంగ అరుపులతో మేల్కొనేవాళ్లం...
దేవిశెట్టి లక్ష్మీనారాయణ, చింతపల్లి
అన్ని ఊర్లు కోడి కూతతో నిద్రలేస్తాయి. కానీ మా ఊరు జనవరి నుంచి జూన్, జులై వరకు కొంగ అరుపులతో మేల్కనేది. మాతాతల కాలం నుంచి ఊరుకొచ్చే కొంగ ఈ ఏడాది రాకపోయే సరికి దిగులుగా ఉంది. ఒకప్పుడు కొంగలను వేటాడేందుకు కొందరు తుపాకులు పట్టుకుని వచ్చేవారు. వారు కంటపడితే ఊరుఊరంతా పొలిమెర దాటించేది. ఏ ఒక్క కొంగకూ హాని జరగకుండా చూసుకునేవాళ్లం. నాకు ఇప్పుడు 75 ఏళ్లు. నా ఊహ తెలిసిన కానుంచి మావూరు కొంగలు రాకుండా ఉండటం ఇది మూడోసారి. అప్పుడప్పుడు వచ్చి కొంగలు చూసిపోతన్నయి గానీ ఇంతకుముందులా గూళ్లు, గుడ్లు పెట్టి పిల్లలను చేయట్లేదు. 2002-03 ఏడాది అనుకుంటా కరువు రోజుల్లోనే కొంగలు రాలేదు తప్ప కోతుల బెడదతో కొంగలు రాకుండా ఉండటం ఇది మొదటిసారి.
కొట్టంలో సర్కారు చెట్టు కొంగల కోసమే కొట్టకుండా ఉంచా...
ముత్యం కృష్ణారావు, సర్పంచ్
ఆ కొట్టంలో ఉన్న సర్కారు చెట్టు మీద పొయిన సంవత్సరం కొంగలు పెట్టిన గూళ్లు అలాగే ఉన్నాయి. ఈ ఏడాది కూడా వస్తాయని ఆ చెట్టు అడ్డమున్నా కొట్టకుండా ఉంచా. కొంగలు వచ్చి చూసి పోతున్నాయి గానీ ఇక్కడ ఉండట్లేదు. చెరువులో పది కొంగలు ఎగురుతూ కనిపించాయి. తెల్లారి చూస్తే కనిపించట్లేదు. కరువు లేకపోయినా కొంగలు ఉండట్లేదంటే కోతులతో వేగలేక చెట్లు నరికి వేస్తుండటమే కారణం.