Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు స్కూళ్ల కంటే 2.10 లక్షల మంది విద్యార్థులు అధికం
- ఇంగ్లీష్ మీడియం, మన ఊరు-మనబడితో ఇంకా పెరిగే అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది. విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనం. ఏటా ప్రభుత్వ స్కూళ్ల కంటే ప్రయివేటు పాఠశాలల్లోనే విద్యార్థులు ఎక్కువగా చదువుతారు. కానీ 2021-22 విద్యా సంవత్సరంలో ఆ గణాంకాలు తారుమార మయ్యాయి. ప్రస్తుత విద్యాసంత్సరంలో 41,392 స్కూళ్లలో 59,46,084 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 30,154 ప్రభుత్వ పాఠశాలల్లో 30,78,189 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 11,238 ప్రయివేటు స్కూళ్లలో 28,67,895 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో ప్రయివేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో 2,10,294 మంది అధికంగా చదువుతుండడం గమనార్హం. 2020-21 విద్యాసంవత్సరంలో 30,148 సర్కారు బడుల్లో 27,99,719 మంది చేరితే, 11,094 ప్రయివేటు పాఠశాలల్లో 32,52,588 మంది చదివారు. ప్రభుత్వ స్కూళ్ల కంటే ప్రయివేటు పాఠశాలల్లో 4,52,869 మంది అధికంగా చదివారు. ఇక 2019-20 విద్యాసంవత్సరంలో 30,135 ప్రభుత్వ పాఠశాలల్లో 27,68,595 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. 10,763 ప్రయివేటు స్కూళ్లలో 32,37,749 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. దీంతో సర్కారు బడుల కంటే ప్రయివేటు పాఠశాలల్లో 4,69,154 మంది విద్యార్థులు అధికంగా చదవడం గమనార్హం. కానీ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయివేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది చదువుతున్నారని పై గణాంకాలను బట్టి తెలుస్తున్నది. కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులు ఉపాధిని కోల్పోవడం, ఆదాయం లేకపోవడంతో ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల భారాన్ని భరించలేక ప్రభుత్వ పాఠశాలల్లో వారి పిల్లలను చేర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరంలో సర్కారు బడుల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నది. ఇంకోవైపు సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించింది. రూ.7,289 కోట్లతో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. మొదటి విడతలో రూ.3,497 కోట్లతో 9,123 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది.