Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరాలో అర్ధాంతరంగా ముగిసిన సభ
- పనిలో చేర్చుకోవాలని డిమాండ్
- పోలీసులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు మధ్య తోపులాట
నవతెలంగాణ-వైరా
ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో ఘనంగా నిర్వహించాలని అనుకున్న సభకు ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగ్రహం బ్రేక్ వేసింది. మంత్రులు తమ ఉపన్యాసాన్ని కొనసాగించలేనంతగా ఆందోళన చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఇండోర్ స్టేడియం, స్పీడ్ బోట్ల ప్రారంభానికి హాజరైన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజరు కుమార్‌ను 'ఉపాధి హామీ చట్టం' ఫీల్డ్ అసిస్టెంట్లు అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు. ఇండోర్ స్టేడియం ప్రారంభం అనంతరం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అధ్యక్షతన జరుగుతున్న సభలో ప్రసంగించేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేవగానే, జిల్లా వాప్త్తంగా తరలివచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులను పైకి లేపి నినాదాలు చేశారు. తమను పనిలో చేర్చుకోవాలని, తమను రోజ్ గార్ సేవక్‌గా పరిగణించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి ప్లకార్డులను లాక్కొని చింపి వేశారు. దాంతో పోలీసులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు మధ్య తోపులాట జరిగింది. దాంతో మంత్రి చెప్పిన నాలుగు మాటలూ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ అర్ధాంతరంగా ఉపన్యాసం ఆపేసి వెళ్ళిపోయారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనను అదుపు చేసేందుకు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టేడియం ఖాళీ అయ్యేంత వరకూ ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడే ఉండటం వారిలో ఉన్న ఆవేదనకు అద్ధం పడుతోంది.
వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో వైరా సీఐ తాటి పాముల సురేష్ వైరా, తల్లాడ, కొణిజర్ల ఎస్ఐలు సిబ్బందితో బందో బస్త్ ఏర్పాటు చేసినా ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యూహాత్మంగా సభలో ప్రవేశించి సభను రద్దు చేసుకుని వెళ్ళే స్థాయిలో నిరసనలు తెలపటం కూడా నాయకుల ఆగ్రహానికి కారణంగా భావిస్తున్నారు.
స్థానిక నాయకులపై ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహం
మంత్రుల సభ అర్ధాంతరంగా ముగియటం, మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ను హోలీ పండుగ మామూళ్ల కోసం లంబాడీ గిరిజన మహిళలు చుట్టుముట్టడం, వేదికపై చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా రసాభాస కావటంతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలోకి ఎవరోస్తున్నారు.. ఎందుకు వస్తున్నారో చూసుకోవద్దా.. తామంతా పార్టీ కోసం రేయంబవళ్ళు కష్టపడుతుంటే మీరేం చేస్తున్నారని పరుష పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు.సభలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజరు కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మెన్ కొండ బాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, మార్క్ ఫెడ్ వైస్ చైర్మెన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మెన్ సూతకాని జైపాల్, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ఎంపీడీఓ ఎన్.వెంకటపతి రాజు, తహసీల్దార్ అరుణ తదితరులు పాల్గొన్నారు.