Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీకే వ్యూహాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు
- మహిళలకు శాసనసభలో సమ ప్రాధాన్యత ఇస్తాం: రేవంత్
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, బంగారు తెలంగాణకు మార్గం సుగమం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మన ఊరు- మన పోరు' సభకు రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. రెండు రాష్ట్రాలను నష్టపోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చిన్న సమస్యలు ఓ లెక్క కాదన్నారు. ఎస్సీ వర్గీకరణతోపాటు మాదాసి, బోయలను ఎస్సీ, ఎస్టీలో చేర్చి తీరుతామని హామీ ఇచ్చారు. సమాజంలో సగభాగం అయిన మహిళలకు శాసనసభతో పాటు క్యాబినెట్లో సమ ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడగానే జరిగిన శాసనసభ ఎన్నికల్లో శ్రీశైలం భూనిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయన్నారు. ఎనిమిదేండ్లు కావస్తున్నా 98 జీవోను ఎందుకు అమలు చేయడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడు తరాలు దాటిన వారికి పరిహారంతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి.. పార్టీ మారారని గుర్తుచేశారు. పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు మల్లన్న సాగర్ తరహాలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎంపీలు పోతుగంటి రాములు, శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిర్సాగర్ ప్రాజెక్టులతో పాటు తుమ్మిళ్ల గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పీకే వ్యూహంతో పాలమూరు జిల్లాలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని, బాధితులను జైలుపాలు చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కటిక దరిద్రంలో ఉన్న పేదలు ఎలా చంపుతారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న 100 సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం కాంగ్రెస్ గెలవడమేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి పోతురాజు, మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, నియోజకవర్గ బాధ్యులు రంగినేని అభిలాష రావు, చింతల జగదీశ్వరరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కోత్వాల్ శంకర్, ప్రసాద్, పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఈకేవీఎన్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.