Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూరగాయలు కోసేందుకు వెళ్లగా ఘటన
నవ తెలంగాణ-జోగిపేట
కూరగాయలు కోసుకునేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చందంపేట శివారులో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేటకు చెందిన మంగలి యాదయ్య (26), చాకలి విఠల్ (28) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. గ్రామానికి చెందిన గొల్ల నర్సింలు, కృష్ణకు చెందిన వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న కూరగాయల పంటను అడవి పందుల బెడద నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఫెన్సింగ్ వైర్‌ను ఏర్పాటు చేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఇది గమనించని యాదయ్య, విఠల్ ఆదివారం రాత్రి దొంగతనంగా కూరగాయలు తీసుకురావడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే విద్యుద్ఘా తానికి గురై ఇద్దరూ మృతిచెందారు. సోమవారం ఉదయం భూ యజ మాని కొడుకు కూరగాయలు కోసేందుకు వెళ్లగా అక్కడ వీరు విగతజీవు లుగా కనిపించడంతో గ్రామస్తులకు సమాచారాన్ని అందించారు. సర్పంచ్ నాగిరెడ్డి పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు చాకలి విఠల్‌కు భార్య లావణ్య, ఇద్దరు కూతుళ్లు ఉండగా, మంగలి యాదయ్యకు భార్య నవనీత, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.