Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరావృతమైతే ఆందోళన చేపడతాం: టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల విద్యాశాఖ అధికారుల అసంబద్ధ వైఖరిని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఇలాంటివి పునరావతమైతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లీషు మీడియం బోధనపై ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశానికి కొన్ని సంఘాలు, కొందరు ఎమ్మెల్సీలను మాత్రమే ఆహ్వానించటం సమంజసం కాదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ప్రారంభించటాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, తమ సంఘం సంపూర్ణంగా స్వాగతించామని గుర్తు చేశారు. ఇంగ్లీషు మీడియం ప్రారంభానికి ముందే అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని విద్యాశాఖ మంత్రి పలుమార్లు హామీ ఇచ్చారని వివరించారు. శిక్షణా తరగతుల ప్రారంభానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డికిగానీ, తమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకుగానీ ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. సంఘాలనూ, ఎమ్మెల్సీలనూ ఆహ్వానించనప్పుడు అధికారిక సమావేశానికి ఇతర సంఘాల నాయకులు ఏవిధంగా హాజరయ్యారని ప్రశ్నించారు. వారిని అధికారులు ఎలా అనుమతించారని నిలదీశారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోయినా కొందరు సంఘనాయకులు తమంతట తామే కలిసి సమావేశం జరిగినట్టు ప్రచారం చేసుకోవటాన్ని లోగడనే విద్యాశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సందర్భంలో అలాంటి ఘటనలు పునరావతం కాకుండా చూస్తామన్నాని తెలిపారు. కానీ పదే పదే అదే విధానం కొనసాగుతున్నదని పేర్కొన్నారు.