Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్ వద్దే తేల్చుకోవాలన్న హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి సస్పెన్షన్‌పై దాఖలైన అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించింది. న్యాయస్థానం ఇచ్చిన నోటీసుల్ని అసెంబ్లీ కార్యదర్శికి అందజేయలేకపోయామని పిటిషనర్ చెప్పడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. స్వయంగా వెళ్లి నోటీసులు అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. అవి అందేలా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. నోటీసులు అందజేసినట్టుగా హైకోర్టు రిజిస్ట్రీ చెప్పడంతో తిరిగి సాయంత్రం పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డిల డివిజన్ బెంచ్ మళ్లీ విచారించింది. అసెంబ్లీ నుంచి ఈనెల ఏడో తేదీన ఏకపక్షంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యేలు ఎం రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, టి.రాజాసింగ్ అప్పీల్ పిటిషన్ వేశారు. దీనిపై సింగిల్ జడ్జి స్టే ఇచ్చేందుకు నిరాకరించారనీ, సస్పెన్షన్‌ను ఎత్తేస్తే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతామంటూ వారు తెలిపారు 'సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వద్దకు వెళ్లాలి. సస్పెన్షన్ ఉత్తర్వుల్ని రద్దు చేయమని కోరాలి. స్పీకర్‌ను సస్పెండైన ఎమ్మెల్యేలు కలుసుకునేలా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. బీజేపీ ఎమ్మెల్యేల వినతిపై స్పీకర్ సస్పెన్షన్ సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే. మంగళవారం అసెంబ్లీ ప్రారంభం కావడానికి ముందే స్పీకర్ ముందు ఎమ్మెల్యేలు అభ్యర్థన చేసుకోవచ్చు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. చట్టసభలో సభ్యులు ఉంటేనే, విపక్ష గొంతు విప్పితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అది పరిఢవిల్లాలంటే ప్రశ్నించేవారూ ఉండాలి. రాజకీయాలు, రాజకీయపార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరిస్తారని అందరూ ఆశించాలి. అప్పీల్‌పై ఇరుపక్షాల వాదనలకు సమయం లేదు. ఎందుకంటే రేపటితో సభ ముగుస్తుంది. కాబట్టి అప్పీల్‌పై విచారణను ముగిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.'అని హైకోర్టు వ్యాఖ్యానించింది.