Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ శాసనసభాపర్వం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతా బాగున్నట్టే ఉంటుంది...అయినా సమస్యల ప్రస్తావన తప్పట్లేదు. ఇదీ అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యుల తీరు. సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఆయన అసెంబ్లీకి రావట్లేదు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించి, సభ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రశ్నోత్తరాలు ఓవైపు కొనసాగుతుండగానే ఎమ్మెల్యేలు మంత్రి చుట్టూ చేరి అభినందనలు చెప్తూ కనిపించారు. శాసనమండలి స్పీకర్ ఎన్నిక ఉండటంతో ప్రశ్నోత్తరాలను స్పీకర్ త్వరగా ముగించారు. 'ఉపన్యాసాలు వద్దు...ప్రశ్నలు మాత్రమే సూటిగా అడగండి' అంటూ సభ్యులను, సమాధానాలు మాత్రమే చెప్పండి అంటూ మంత్రులనూ ఆయన పలుమార్లు హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల్లో కేవలం ఐదు ప్రశ్నలకు మాత్రమే సభలో చర్చకు వచ్చాయి. మరో ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టే భావించమంటూ స్పీకర్ ప్రకటన చేశారు. ఆ వెంటనే మొదలైన జీరో అవర్‌లో సభ్యులు సమస్యల చిట్టా విప్పారు. ఓ దశలో అధికారపార్టీ సభ్యులే మా గోసను పట్టించుకోవట్లేదంటూ ఆక్రోశించడంతో... రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని చెప్పాకదా...ఎందుకివ్వట్లేదంటూ స్పీకర్ మంత్రులను ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ మధ్య జరిగిన మాటల యుద్ధంపైనా స్పీకర్ అధికారపార్టీ సభ్యులను కట్టడి చేయడానికే ప్రయత్నించారు. ఓ దశలో బాల్క సుమన్‌ను కాస్తంత గట్టిగానే మందలించారు. అధికారపార్టీ సభ్యులు మాట్లాడుతుండగానే వారి మైక్ కట్ చేసి, కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్కకు మైక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 'అంతా మీవల్లే...' అంటూ ఆపార్టీపై విమర్శల విల్లు ఎక్కుపెట్టి దాడి చేశారు. ఇక శాసనమండలి చైర్మెన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రులు సహా మండలి సభ్యులంతా ఆయన గుణగణాలను కీర్తించడానికే పరిమితమయ్యారు. 'మీకు మనసులో ఏదో కావాలని ఉండొచ్చు...కానీ సీఎం కేసీఆర్ దానికంటే గొప్ప పదవి మీకిచ్చారు' అంటూ మంత్రి చామకూర మల్లారెడ్డి మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడటం చర్చకు దారితీసింది. గుత్తా మనసులో ఏం కావాలని కోరుకున్నారో..అని విషయం తెలియని వారికీ తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. మండలిలో చైర్మెన్ ఎన్నిక, మంత్రులు, సభ్యుల ప్రసంసలు ముగియగానే పెద్దల సభ వాయిదా పడింది. శాసనసభ రాత్రి 10 గంటల వరకు జరిగింది. ఇక బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలను స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లే బాధ్యతను శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు అప్పగించింది. మంగళవారంతో శాసనసభ సమావేశాలు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను కలుస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది.