Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందర్నీ భాగస్వామ్యం చేయడమే మా ఉద్దేశం
- ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల మే నెల జీతాల్లోంచి జమ :
- మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ హరిత నిధి ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర మంత్రులు టి.హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తీసుకొచ్చిన హరితహారంలో ప్రతిఒక్కర్నీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో నిధిని ఏర్పాటు చేశామనీ, ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల మే నెల జీతంలో కొంచెం హరితనిధికి జమవుతుందని తెలిపారు. హరితనిధి విధివిధానాలు, విరాళాల జమపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అంసెబ్లీ కమిటీ హాల్లో మంత్రుల సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సంబంధిత శాఖల అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలనీ, అలాగే తెలంగాణకు హరితహారం, హరితనిధి ఉద్దేశాలను అందరికీ అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ఇప్పటికే ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంపెనీలు, షాపులు, వివిధ ఎస్టాబ్లిష్ మెంట్ల నుంచి తగిన మొత్తం హరిత నిధికి జమయ్యేలా చూడాలని మంత్రులు ఆదేశించారు. అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంచడంలో దేశంలోనే తెలంగాణ మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. హరితనిధి ద్వారా సమాజంలోనూ, పౌరుల్లోనూ పచ్చదనంపై బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. జమయ్యే నిధితో నర్సరీల్లో మొక్కల పెంపకం, పచ్చదనం పెంపునకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాక కార్యదర్శి సునీల్ శర్మ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ ఎంసీ. పర్గెయిన్, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, సివిల్ సప్లరు శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.