Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కలెక్టరేట్ల వద్ద బాబు చిత్రపటానికి నివాళి: వీఆర్ఏ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంచిర్యాల జిల్లా కన్నేపల్లి తహసీల్దారు కార్యాలయంలో నైట్ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్న కొత్తపల్లి వీఆర్ఏ దుర్గంబాబును దుండగులు హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వీఆర్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కే దాదేమియా, వంగూరు రాములు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాబు కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలనీ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ కట్టివ్వాలని కోరారు. రెవెన్యూ అధికారులు వీఆర్ఏలకు సంబంధం లేని నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయించడం దారుణమని పేర్కొన్నారు. 2005 వీఆర్ఏల సర్వీస్ రూల్స్, జీఓ నెం.1849 (15వ అంశం)లో పగలు అటెండర్లుగా, రాత్రి వాచ్మెన్లుగా పనిచేయించకూడదనీ, అధికారుల సొంత పనులకు వీఆర్ఏలను వాడుకోవద్దనే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. నైట్ వాచ్మెన్ డ్యూటీలను రద్దు చేయాలనీ, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం ప్రకటించిన పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, అర్హత కల్గిన వారికి ప్రమోషన్లు, వీఆర్ఏల సొంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. దుర్గం బాబు హత్యకు నిరసనగా, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రెండు రోజులపాటు వీఆర్ఏలంతా విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చిన విషయం విదితమేనని తెలిపారు. అందులో భాగంగా మంగళవారం నాడు కలెక్టరేట్ల వద్ద దుర్గం బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించి, అధికారులకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేయాలని కోరారు.