Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయంలోనే దారుణం
- పాతకక్షలే కారణమంటున్న కుటుంబ సభ్యులు
- ఆధారాల సేకరణలో పోలీసులు
నవతెలంగాణ-మంచిర్యాల
రెవెన్యూ రికార్డుల భద్రత నిమిత్తం నైట్డ్యూటీలో ఉన్న వీఆర్ఏ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. సోమవారం ఉదయం వీఆర్ఏ రక్తపుమడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నెపల్లి మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ దుర్గం బాబు రెవెన్యూ రికార్డుల భద్రత నిమిత్తం తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం నైట్ డ్యూటీకి వెళ్లాడు. సోమవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది కార్యాలయానికి వెళ్లగా బాబు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. దీంతో సిబ్బంది స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీశారు. పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబు హత్యకు గురయ్యాడనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా దుర్గం బాబును చంపేస్తానని బెదిరిస్తున్నాడని, దీనిపై పోలీస్స్టేషన్లోనూ ఫిర్యాదు చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వ్యక్తే బాబును హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. దాంతో పాటు వీఆర్ఏ వారసత్వ ఉద్యోగ విషయమై గొడవలున్నట్టు సమాచారం. పోలీసులు వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? లేదంటే రెవెన్యూ అధికారుల గొడవలతో జరిగిందా? లేక వారసత్వ ఉద్యోగం విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానమున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. మృతుడు దుర్గం బాబుకు భార్య అమ్మక్క, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
వీఆర్ఏ హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
నవతెలంగాణ - విలేకరులు : నైట్ డ్యూటీలో దారుణహత్యకు గురైన వీఆర్ఏ దుర్గం బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ వీఆర్ఏలు ఖానాపూర్ తహసీల్దార్ లక్ష్మికి సోమవారం వినతిపత్రం అందజేశారు. బాబు హత్యకు నిరసనగా రెండు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
నైట్ డ్యూటీలో ఉన్న బాబును అతి దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నైట్ డ్యూటీలు మానేస్తున్నట్టు తెలిపారు. వినతిపత్రం అందజేసిన ప్రతినిధి బృందంలో రాజన్న, సంతోష్, గణేష్తో పాటు పలువురు వీఆర్ఏలు ఉన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్లోనూ వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
వీఆర్ఏ దుర్గం బాబు హత్యను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా దోమ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓలు, వీఆర్ఏలు నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్ఏలు శ్రీను, వెంకట్, చంద్ర శేఖర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో వీఆర్ఏలు నిరసన తెలిపారు. తెలకపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.