Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడ్డుకు అదనపు బడ్జెట్ కేటాయించాలి: సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 83 వేల మంది మధ్యాహ్న భోజనం కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. వారికి నెలకు గౌరవ వేతనం రూ.వెయ్యి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. వేతనంతోపాటు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రతి విద్యార్థికీ రోజుకు రూ.4.60 పైసలు, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.6.18 పైసలు ప్రభుత్వం చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. వారానికి మూడు గుడ్లు, కూరగాయలు, పప్పు, వంటగ్యాస్ మొదలైన ఖర్చులు పెట్టాలని వివరించారు. కానీ పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా ఈ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. కార్మికులు అదనంగా అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో అందక నిధులు సరిపోక, తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక వారు నష్టపోతూనే ఉన్నారని వివరించారు. వారంతా బడుగు, బలహీనవర్గాలకు చెందిన నిరుపేద మహిళలని తెలిపారు. వారికి గౌరవ వేతనం సకాలంలో చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇవ్వాలనీ, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గుడ్డుకు మార్కెట్ రేటు ప్రకారం బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించాలని సూచించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వసతులు, సౌకర్యాలు మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.