Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ అభ్యర్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ సహా పలువురి అరెస్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ-2017)లో పెండింగ్లో ఉన్న 558 ఉర్దూ మీడియం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేండ్లుగా ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా అభ్యర్థులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. 900 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి కేవలం 342 పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని వివరించారు. మిగిలిన 558 పోస్టులను పెండింగ్లో ఉంచిందని చెప్పారు. పరీక్ష రాసి అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థులు ఆ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మరోవైపు ఉపాధ్యాయుల్లేక విద్యార్థులకు చదువులు అందడం లేదన్నారు. రాష్ట్రంలో ఉర్దూ రెండో అధికార భాష అని చెప్తున్న ప్రభుత్వం ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా చాలా అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీలో అర్హత పొందిన అభ్యర్థులతో 558 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం టీఆర్టీ-2017 స్ట్రగుల్ కమిటీ అధ్యక్షులు మోహిజ్, షారూఖ్, అహ్మద్ హుస్సేన్, హామీద్, ఫర్హానా తదితరులు పాల్గొన్నారు.