Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ మాట్లాడే అవకాశమిస్తా:మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
- మంత్రులు, ఎమ్మెల్సీల అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనమండలి చైర్మెన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం చైర్మెన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ప్రకటించారు. తొమ్మిది సెట్ల నామినేషన్లు ఆయన ఒక్కరే దాఖలు చేశారని వివరించారు. సుఖేందర్‌రెడ్డిని మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి తోడ్కొని వెళ్లి చైర్మెన్ స్థానంలో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు రెండోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రోత్సహించిన మంత్రులు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు చెప్పారు. పెద్దల సభ ఔన్నత్యాన్ని పెంచుతానని చెప్పారు. ప్రజాసమస్యలపై అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తానని అన్నారు. చట్టసభలు దేశానికే తలమానికమన్నారు. మొదటిసారి చైర్మెన్‌గా 21 నెలలు పనిచేశానని వివరించారు. అందరి సహకారంతో సభ హుందాతనాన్ని పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీనియర్ల సహకారంతో జూనియర్లు అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా, అర్థవంతమైన చర్చలు జరిపి శాసనమండలి ప్రతిష్టను మరింత పెంచుకోవాలని అన్నారు. అనంతరం మంగళవారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేశారు. అంతకుముందు రెండోసారి చైర్మెన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డిని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందిస్తూ మాట్లాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ముగ్గురూ రైతుబిడ్డలే : కేటీఆర్
సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముగ్గురూ రైతుబిడ్డలే కావడం అందరికీ గర్వకారణమని మంత్రి కేటీ రామారావు చెప్పారు. గుత్తా 1981లో వార్డుమెంబర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. కేసీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కృష్ణా జలాలు ఇంటింటికీ అందించినప్పుడే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారమని సుఖేందర్‌రెడ్డి గతంలోనే ప్రకటించారని వివరించారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పైలాన్‌ను చౌటుప్పల్‌లో ఆవిష్కరించామని గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఫ్లోరైడ్ సమస్య లేదంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారని అన్నారు. ఆయన రైతు సమన్వయ సమితి మొదటి చైర్మెన్‌గా వ్యవహరించారని చెప్పారు. ప్రతిపక్షాలు, అధికారపక్షం అన్న తేడా లేకుండా ప్రజాస్వామికంగా పనిచేయాలని సూచించారు. దామాషా ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని అన్నారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, టి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం అందరికీ ఎంతో ఆదర్శమని చెప్పారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. సభను హుందాగా నడపాలని కోరారు. 'మీ మనసులో ఒకటుంది. అది కావాలని కోరుకుంటున్నారు. కానీ దాని కంటే ఉన్నతమైన పదవిలో సీఎం కేసీఆర్ మిమ్మల్ని కూర్చోబెట్టారు.'అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ హౌజ్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక సూచనలి స్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాలకు ఎక్కువ సమయమివ్వాలి : నర్సిరెడ్డి
ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రజాసమస్యలు ఎక్కువగా చర్చకు వస్తాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పెద్దల సభ నడుస్తున్నదని అన్నారు. పాత అసెంబ్లీ భవనంలోకి మండలిని మార్చాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గంగాధర్‌గౌడ్ సూచించారు. ఎమ్మెల్సీలకు శిక్షణా కార్య క్రమాలు నిర్వహించాలనీ, ఇతర రాష్ట్రాల్లో చట్టసభల పనితీరును పరిశీలించేం దుకు సభ్యులను తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని వార్డు సభ్యులంతా స్ఫూర్తి పొందేలా సుఖేందర్‌రెడ్డి రాజకీయ అను భవం ఉందన్నారు. ఆయన రెండోసారి చైర్మెన్ కావడం అభినందనీయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండ ప్రకాశ్, ఫారూఖ్ హుస్సేన్, ఎల్ రమణ అన్నారు.