Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫించన్ల విషయంలో సీఎం కేసీఆర్‌ను అబ్దిదారులు పెద్దకొడుకులా భావిస్తున్నారని టీఆర్ఎస్ సభ్యులు సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. ఈ క్రమంలో వితంతువులు, వికలాంగులు, వృద్దుల ఫించన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో పంచాయతీరాజ్ పద్దులపై ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంలో పని చేస్తున్న కార్మికులకు పేస్కేల్ విడుదల చేయాలని కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు తగ్గాయనీ, అందుకు కారణంగా పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని కొనియాడారు. గ్రామ పంచాయతీలపై ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరారు. ఆయా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామపంచాతీభవనాలు నిర్మించండి :కోమటిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నదనీ, కానీ గ్రామపంచాయతీ భవనాలను నిర్మించడం లేదని కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. వెంటనే పంచాయతీలకు భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనసభలో ఆయన పద్దులపై మాట్లాడారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు.మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ నుంచి నారాయణపురం వరకున్న రోడ్డు అధ్వానంగా మారిందనీ, గత సమావేశాల్లోనూ సమస్యను ప్రస్తావించినప్పటికీ అతీగతీ లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులపై ఒత్తిడి చేసి కొన్ని పనులు చేయించారనీ, వారికి ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో అప్పుపాలై కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ 15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు రెండూ లేవన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా పాతవైపుల ద్వారా నీళ్చించి, కొత్త వైపుల పేరుతో దోచుకున్నారని చెప్పారు.
రోడ్ల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు :మంత్రి వేముల
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్అండ్బీ పరిధిలో తెలంగాణలో 27,461 కి.మీ పొడవుగల రోడ్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో 1,727 కి.మీ రాష్ట్ర రహదారులు,11,371 కి.మీ ప్రధాన జిల్లా రోడ్లు,14,363 కి.మీ ఇతర జిల్లా రోడ్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో 60 ఏండ్ల కాలంలో ఎన్ని బ్రిడ్జీలు నిర్మాణమయ్యాయో..ఏడేండ్లలో అన్ని బ్రిడ్జీలు పూర్తయ్యాయని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోనే పాత సచివాలయ సముదాయ స్థానంలో కొత్త సచివాలయ సముదాయ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. నియోజవర్గాల్లో కార్యాలయాల నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. సచివాలయ నిర్మాణం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ 125 అడుగల విగ్రహం, సెస్అకాడమి భవనం, పోలీసు కమాండో భవనం, తదిర ముఖ్యమైన ప్రతిష్టాత్మక భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల గౌరవాన్ని పెంపొందించేలా నాణ్యమైన రెండు పడకల గదుల ఇండ్లు నిర్మాణం ఇప్పటికే చాలా చోట్ల జరిగిందన్నారు. వరస ఎన్నికలు, వాటి నియమాలు, కోవిడ్-19 కారణంగా కొంత ఆలస్యమైన మాట నిజమేనన్నారు. వచ్చే రెండు మూడు నెలల్లోనే అర్హులైన అందరికీ పూర్తయిన ఇండ్లను ఇవ్వనున్నట్టు చెప్పారు.