Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలట !
- అసెంబ్లీలో పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శ
- తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రమే చెబుతున్నది : మంత్రి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
''కరెంటు విషయంలో కేంద్రం తెలంగాణపై కుట్రలు చేస్తున్నది..రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలట..విద్యుత్ విషయంలో తొలినాళ్లల్లో సీఎం కేసీఆర్ కష్టపడి విజయం సాధించారు..స్వయానా ముఖ్యమంత్రే రైతు..అందుకే మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకోలేదు'' అని అధికారపార్టీ సభ్యులు ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ రాష్ట్ర ప్రజలు, రైతుల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారనీ, ఆయనకు రాజకీయ స్వార్థం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదనీ, వాటిని అమలుచేయాలంటూ ఒత్తిడి చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలనూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకోబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా సౌకర్యం మెరుగుపడిందని గుర్తు చేశారు. జాతీయ రహదారులు సైతం బాగుపడ్డాయని చెప్పారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి సింగిల్ లైన్, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబులైన్ లైన్, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్లు వచ్చాయని వివరించారు. జిల్లాల్లో వంతెనలు సైతం నిర్మాణమవుతున్నాయని చెప్పారు. అవుట్ రింగ్ రోడ్డు అవతల 344 గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు మంజూరైందన్నారు. రాష్ట్రమంతా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు జాతీయ రహదారి ఏర్పాటైందని తెలిపారు. మెదక్ నుంచి బోధన్ టౌన్ వరకు మరో కొత్త రోడ్డు మంజూరైందనీ, ఈ రోడ్డు టౌన్ నుంచి కాకుండా బయట నుంచి రింగురోడ్డు మాదరిగా నిర్మించాలని కోరారు. తద్వారా మెదక్‌లో మరింత అభివృద్ధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు.
ఏడేండ్లల్లోనే సాగునీటిని సాధించాం:పెద్దిసుదర్శన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంపై అటు ఏపీ, ఇటు కేంద్ర ప్రభుత్వాల కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని టీఆర్ఎస్ సభ్యులు పెద్దిరెడ్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రం నేడు సాగునీటిరంగంలో ముందుకుపోతున్నదన్నారు. చిన్న కమతాల వ్యవసాయం నడిచే రాష్ట్రంలో నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడిందని అభిప్రాయపడ్డారు. 70 ఏండ్లుగా కోల్పోయిన నీళ్ల హక్కును కేవలం ఏడేండ్లల్లోనే సీఎం కేసీఆర్ సాధించారంటూ అభినందించారు. రెండు పంటలకూ నీళ్లు అందుతున్నాయని అన్నారు. రీడిజైన్లతో తెలంగాణ హక్కును కాపాడుతున్నారనీ, కాంట్రాక్టర్ల జేబులు నింపడం లేదన్నారు. రాష్ట్రం హక్కులను కాపాడే బాధ్యత బీజేపీకి లేదా ? అని ప్రశ్నించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులను కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. గోదావరి, కావేరి నదులను ఎలా అనుసంధానం చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం పైసా ఇవ్వకపోగా సమస్యలను సృష్టిస్తున్నదని విమర్శించారు. కృష్ణా నదీ విషయంలో మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్, బీజేపీ అడ్డుతగులుతున్నాయనీ, రాజకీయ స్వార్థంతో ఆలోచిస్తున్నాయని చెప్పారు.
పల్లెప్రగతి బ్రహ్మాండం : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం బ్రహ్మాండంగా అమలవుతున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. సభలో ఆ శాఖ పద్దుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానం చెబుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో పల్లెప్రగతిని ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చాలా గ్రామాలు గంగదేవిపల్లిని మించిపోయాయని చెప్పారు. పంచాయతీలకు విధులతోపాటు నిధులూ ఇస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులతోపాటు ప్రజాప్రతినిధుల వేతనాలూ పెంచామన్నారు. గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చిన తర్వాత వాటి కిస్తులను కట్టడంతోపాటు పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్నాయని చెప్పారు. పల్లెప్రగతిలో ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, హరితహారం పనులతోపాటు ఉపాధి హామీ పనులు కూడా బాగా కొనసాగుతున్నాయని వివరించారు. రూ.369 కోట్ల గ్రిన్బడ్జెట్ను సైతం కేటాయించామ న్నారు. కేంద్ర ప్రభుత్వం మన పల్లెలు, మండలాలకు అనేక అవార్డులను ప్రకటించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో కంటే మూడు రెట్లు అధికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. రూ. 58 వేల కోట్లు వ్యయం చేసినట్టు చెప్పారు. పింఛన్లు దేశంలోనే అత్యధికంగా, అధికమొత్తం లో ఇస్తున్నట్టు చెప్పారు. సీపీఐ(ఎం) ప్రభుత్వం ఉన్న ఒక్క కేరళలో రూ. 1,400, తమిళనాడులో రూ. 1000 ఉందనీ, బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రాల్లో రూ. 300 నుంచి రూ.400 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. గుజరాత్, బీహార్‌లోనూ పింఛన్లు తక్కువగానే ఇస్తున్నారని అన్నారు.సాధారణ పింఛన్లతోపాటు వికలాంగులకూ మన రాష్ట్రంలోనే అత్యధికంగా అమలుచేస్తున్నట్టు అభిప్రాయప డ్డారు. రాష్ట్రంలో గతంలో కుండలు, బిందెలు పట్టుకుని పల్లెల్లో, అసెంబ్లీ దగ్గర ఆందోళన చేసే పరిస్థితి గతంలో ఉండేదనీ, కేసీఆర్ నాయక త్వంలో మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని గుర్తు చేశారు. భగీరథ నీళ్లు ఆరోగ్యానికి మంచివనీ,అందరూ తాగాలని కోరారు.తెలంగాణను ఫ్లోరైడ్ లేని రాష్ట్రంగా కేంద్రం పార్లమెంటులో ప్రకటించిందని తెలిపారు. స్థ్రీ నిధి పథకం కింద మహిళలకు వడ్డీలేని రుణాలను ఇస్తున్నామనీ, ఎవరైనా మరణిస్తే తీసుకున్న రుణ మొత్తాన్నీ మాఫీ చేస్తున్నట్టు సభకు తెలియజేశారు.