Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ వర్సెస్ పేకాట
- సందర్భమేదైనా రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులపై ఫోకస్ :తలసాని
- పేకాటాడే వాళ్లు మంత్రులైయిపోయారన్న కోమటిరెడ్డి
- క్షమాపణకు అధికార పక్షం పట్టు
- ఆయనవైపు దూసుకొచ్చిన అధికార సభ్యులు
- వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను...
- 13 ఏండ్లుగా ప్రజాసేవ చేస్తున్నా...అయినా కాంట్రాక్టర్ ముద్ర
- 'పేకాట' వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల నిరసన
- రికార్డుల తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన
- వ్యక్తి దూషణలు సరికావన్న భట్టి
- ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం : వేముల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యుల వ్యవహర శైలి హద్దులు దాటింది. వ్యక్తిగత దూషణలు, విమర్శలతో సభ హీటెక్కింది. అధికారపక్షం, కాంగ్రెస్ సభ్యుల వాగ్వాదంతో రచ్చయింది. సభ్యులను చివరకు స్పీకర్ మందలించాల్సి పరిస్థితి ఏర్పడింది. అయినా అధికార పార్టీ సభ్యులు దూకుడుగా వ్యవహరించారు. సోమవారం శాసనసభలో వివిధ పద్దులపై కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతున్నదనీ, సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారనీ, తెలంగాణకు సంబంధించిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందిస్తూ...శాసనసభలో పద్దుల విషయాన్ని పక్కదారి పట్టించి, స్పీకర్ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇతర అంశాలను ప్రస్తావిస్తున్నారంటూ రాజగోపాల్‌రెడ్డి ఎదురుదాడి చేశారు. బయట మాత్రం స్పీకర్ ప్రతిపక్షాల గొంతునొక్కుతారంటూ విమర్శలు చేస్తారు. ఇక్కడ మాత్రం ఆయన కాంట్రాక్టర్‌గా చెప్పిన విషయాలే చెబుతారంటూ విమర్శి ంచారు. సందర్భమేదైనా...రాజగోపాల్‌రెడ్డికి కాంట్రాక్టులు, కాంట్రాక్టర్లే గుర్తొస్తారనీ, ఆయన కాంట్రాక్టర్ కాబట్టి అవే మాట్లాడుతారని తలసాని తిప్పికొట్టారు. మంత్రి వ్యాఖ్యలతో రాజగోపాల్‌రెడ్డి ఊగిపోయారు. పొద్దునలేస్తే పేకాట ఆడేవాళ్లు మంత్రులైపోయారంటూ తలసానిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేకాట వ్యాఖ్యలపై అధికార సభ్యుడు బాల్కసుమన్ మాట్లాడుతూ సీనియర్‌మంత్రి, బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతావా? అంటూ నిలదీశారు.
కాంగ్రెస్ అధ్యక్షడు కుసంస్కారవాది : కేటీఆర్
మంత్రి కేటీఆర్ కూడా రాజగోపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సినందేనంటూ డిమాండ్ చేశారు. ఆ పార్టీ అధ్యక్షులు రేవంత్ కుసంస్కారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదినాన్ని కూడా పీసీసీ చీఫ్ సంతాపదినాలుగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఉంటే, ఐదురాష్ట్రాల ఫలితాలు చూసి ఆస్పత్రిలో చేరారంటూ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారని విమర్శించారు. అధికారపక్షం అవినీతికి పాల్పడితే సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీకి చెందిన కెపి వివేకానంద్, చల్లాధర్మారెడ్డి మిగతా సభ్యులు సైతం గొంతు కలుపుతూ రాజగోపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ పెద్ద పెట్టున నినదించారు. మరికొంత మంది సభ్యులు తలసాని సీటు వద్దకు దూసుకొచ్చి...రాజగోపాల్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. క్షమాపణ చెప్పాలంటూ పట్టుపట్టారు. సభలో నెలకొన్న పరిస్థితులను దారికి తెచ్చేందుకు స్పీకర్ అందర్నీ మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ సభ్యులు బాల్క సుమన్‌ను కూర్చొమని ఆయన గట్టిగానే చెప్పాల్సి వచ్చింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా సభలో ఇలాంటి భాష ఉపయోగించడం సరైందికాదన్నారు. ఇంజినీర్, లాయర్ వృత్తిలానే...కాంట్రాక్టర్ కూడా ఒక వృత్తే అనీ కాంట్రాక్టర్ అంటే ఎందుకు బాధపడుతున్నాడో అర్థం కావడం లేదని చెప్పారు.
ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కోరారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా కాంట్రాక్టర్, పేకాట రెండు పదాలను రికార్డుల్లోంచి తొలగించాలని కోరారు. సభ్యులు ఇలాంటి పదాలను ఉపయోగించడం సరైంది కాదని సూచించారు. వ్యక్తిదూషణలు మంచి సంప్రదాయం కాదని తెలిపారు.
ఆ వ్యాఖ్యలు విత్‌డ్రా : రాజగోపాల్‌రెడ్డి
'మంత్రి తలసానిపై నేను చేసిన వ్యాఖ్యలు బాధతో చేసినవే. గత పదమూడేండ్లుగా ప్రజాసేవలో ఉన్న. అన్ని వదిలేసి ప్రజా సేవ చేస్తున్న. నన్ను పట్టుకుని కాంట్రాక్టు అనడంతో నేనేంతో బాధ పడ్డా. ఆ బాధలోనే ఆ పదాన్ని ఉపయోగించాను. ఆ వాఖ్యలను విత్‌డ్రా చేసుకుంటున్న' అని రాజగోపాల్ చెప్పారు. విత్‌డ్రా కాదు...క్షమాపణ చెప్పాలంటూ అధికార పక్ష సభ్యులు మళ్లీ పట్టు పట్టారు. క్షమాపణ చెప్పేది లేదంటూ రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. పేకాట పదాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ క్షమాపణ చెప్పారో, లేదో అనేది విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ ప్రకటించడంతో సభ ఆర్డర్‌లోకి వచ్చింది. సభ్యులు శాంతించారు. అనంతరం టీఆర్ఎస్ సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డి భారీనీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ పద్దులపై చర్చను కొనసాగించారు.