Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో అరుణజ్యోతి అధ్యక్షతన జరిగిన వర్క్‌షాపులో ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. 2014 వరకు ఈ పథకంలో 21లక్షల మంది రూ.545 కోట్లు జమచేసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరికి రావాల్సిన పెన్షన్ ప్రభుత్వం ఆపేసిందని పేర్కొన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి లబ్దిదారులకు ఇస్తామని చెప్పటం హర్షించదగిందేనని తెలిపారు. ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమానికి .87శాతం కేటాయించటం పట్ల మహిళలపై ప్రభుత్వ చిత్తశుద్ది అర్థమవుతున్నదని విమర్శించారు. వర్క్‌షాపులో రాష్ట్ర ఉపాధ్యక్షులు కెఎన్ ఆశాలత, యం లక్ష్మమమ్మ, సహాయ కార్యదర్శులు డి ఇందిర, యం భారతి, పి ప్రభావతి, ఎస్ లత, యం వినోద, కె గీతారాణి పాల్గొన్నారు.