Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం
- అందరూ భాగస్వాములై దిగ్విజయం చేయాలి : విద్యామంత్రి సబిత వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెండు, మూడు రోజుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భాషేతర సబ్జెక్టులను బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆంగ్లమాధ్యమంలో శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ విద్యావైద్యరంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. సమూల మార్పులతోనే ఉన్నత ఫలితాలు సాధిస్తామన్నారు. సమాజంలో ఇంగ్లీష్ మీడియంలో చదివించడం హోదాగా మారిందని చెప్పారు. పిల్లలను ఇంగ్లీష్‌లో చదివించకపోతే ఉద్యోగాలు రావేమో అన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొందన్నారు. సంపన్నులు, ఉన్నత వర్గాల పిల్లలతోపాటు పేదలూ ఇంగ్లీష్ మీడియంలోనే చదివిస్తున్నారని వివరించారు. కరోనా నేపథ్యంలో ప్రయివేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు మూడు లక్షల మంది చేరారని అన్నారు. వారు వెనక్కి వెళ్లకుండా సర్కారు బడుల్లోనే చదివేలా వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఉపాధ్యాయులకు తొమ్మిది వారాలపాటు దీర్ఘకాలిక శిక్షణ ఇస్తామని అన్నారు. రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణా సంస్థ, అజీంప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఈ ట్రైనింగ్‌ను రెండుదశల్లో నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో 81,590 మంది ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. మౌలిక వసతుల కల్పన కోసం 'మన ఊరు-మనబడి' కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. 12 అంశాలను అభివృద్ధి చేస్తామన్నారు. టారులెట్ల నిర్మాణం నుంచి డిజిటల్ తరగతుల వరకు విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని రూ.7,289 కోట్లతో సర్కారు బడులను బలోపేతం చేస్తామన్నారు. జిల్లాల కలెక్టర్లకు రూ.రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ భాగస్వాములు కావాలనీ, తద్వారా దిగ్విజయం చేయాలని కోరారు. 19 వేల ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ, కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకాలు వంటి నిర్ణయాలతో విద్యాయజ్ఞం కొనసాగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియంను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు కె జనార్ధన్‌రెడ్డి, కె రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.