Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య రాజధానిగా తెలంగాణ
- కొత్తగా 33 మెడికల్ కాలేజీలు
- నిమ్స్‌లో మరో రెండువేల బెడ్స్ ఏర్పాటు
- 20వేల ఖాళీలు భర్తీ చేస్తాం :అసెంబ్లీలో ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గత ప్రభుత్వాలకు ముందుచూపు లేనందువల్లే మెడిసిన్ చదివే విద్యార్థులు చైనా, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వలసలు వెళ్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయనీ, స్వరాష్ట్రంలో వాటి సంఖ్యను 33కు పెంచుతున్నామని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వరంగంలోనే ఏర్పాటవుతాయని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు వాటి సంఖ్య 2,850కి పెరుగుతుందని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే 8 కొత్త మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, మర్రి జనార్థన్‌రెడ్డి, ఎం సంజరు, బానోతు శంకర్ నాయక్, గాదరి కిషోర్‌కుమార్ ప్రశ్నలు అడిగారు. దీనికి మంత్రి సమాధానం చెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం 171 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిందనీ, రాష్ట్రానికి కూడా ఇవ్వాలని ప్రతిపాదనలు పంపితే, వాటిని తిరస్కరించి అన్యాయం చేశారని అన్నారు. ఒక్కో మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తుందనీ, ఆ నిధుల వస్తాయని ఆశించి, భంగపడ్డామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో పల్లె, బస్తీ దవాఖానాల ఏర్పాటుతో ఐదంచెల ఆరోగ్య వ్యవస్థను నిర్మించామన్నారు. నిమ్స్ అస్పత్రిలో ప్రస్తుతం 1,450 పడకలు ఉన్నాయనీ, వాటికి అదనంగా మరో రెండువేల బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వంద పడకలు మరో వారంరోజుల్లో అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వైద్యారోగ్య శాఖలో 20వేల ఖాళీలను గుర్తించామనీ, త్వరలో వాటిని భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు ముందుచూపు లేనందువల్లే రాష్ట్ర విద్యార్థులు చైనా, ఉక్రెయిన్ వంటి విదేశాల్లో డాక్టర్ విద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారని చెప్పారు. పీజీ సీట్ల సంఖ్యను 530 నుంచి 938కి పెంచామన్నారు. మెడికల్ కళాశాలల్లో విద్యార్థుల ప్రయోగాలకు మృతదేహాల కొరత ఉన్నదనీ, హౌంశాఖ చట్ట సవరణతో ఆ ఆవరోధాన్ని అధిగమించవచ్చనీ, త్వరలో దాన్ని చేపడతామని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో బస్తీ దవాఖానాల ఏర్పాటుపై సభ్యులు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బీగాల గణేష్, ఆరూరి రమేష్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కూడా మంత్రి సమాధానాలు చెప్పారు. గ్రేటర్ పరిధి, ఔటర్ రింగ్‌రోడ్ లోపలి ప్రాంతాల్లో మొత్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామనీ, దానిలో 259 ఏర్పాటయ్యాయని తెలిపారు. మరో 92 త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ, పల్లె దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తున్నదని వివరించారు. ఒక్కో బస్తీ దవాఖానాపై ప్రభుత్వం రూ.75వేలు ఖర్చు చేస్తున్నదనీ, ఒక డాక్టర్, స్టాఫ్ నర్స్, హెల్పర్ అక్కడ ఉంటారనీ, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు బస్తీ దవాఖానాల ద్వారా 81 లక్షల మందికి సేవలు అందించామనీ, వాటికే టెలీమెడిసిన్, కన్సల్టేషన్ సేవల్ని అనుసంధానిస్తూ, టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని వివరించారు.