Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో మంగళవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎండల తీవ్రత ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒంటిపూట బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్తారని వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రకటించారు. ఆర్జేడీలు, డీఈవోలు ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే పాఠశాలల చివరి పనిదినంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. అకడమిక్ క్యాలెండర్లో మాత్రం వచ్చేనెల 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినమని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేనెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుంటాయని పేర్కొంది. ఇంకోవైపు రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మే 11 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.