Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తిగా మారనున్న షెడ్యూల్
- నేడు నిర్ణయం ప్రకటిస్తాం : సబిత
- విద్యామంత్రితో ఇంటర్ బోర్డు కార్యదర్శి భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అడ్డంకులొచ్చాయి. వచ్చేనెల 22 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పూర్తిగా మారే అవకాశమున్నది. జేఈఈ మెయిన్‌కు ముందే ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించి విద్యామంత్రి ఆమోదానికి పంపించినట్టు తెలిసింది. మంగళవారం ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నది. ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షలను నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 21 నుంచి ఇంటర్ పరీక్షలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ మెయిన్ షెడ్యూల్ రావడంతో అందుకనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీలను ప్రభుత్వం మార్చింది. కానీ ఇప్పుడు జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరించింది. ఏప్రిల్ 21,24,25,29తోపాటు మే ఒకటి, నాలుగు తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ ప్రభావం ఇంటర్ పరీక్షలపై పడింది. వచ్చేనెల 25, 29 తేదీల్లో ఇంటర్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇంకోవైపు విద్యార్థులు ఒకరోజు ఇంటర్ పరీక్షలు, ఇంకోరోజు జేఈఈ మెయిన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఏం చదవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు పరీక్షల షెడ్యూల్‌ను మొత్తం సవరించాలని భావిస్తున్నట్టు సమాచారం.
జేఈఈ మెయిన్ కంటే ముందుగానే ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేలా టైంటేబుల్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసిందే. జేఈఈ మెయిన్ తర్వాత ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే మే 11 నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో అటు పది విద్యార్థులను, ఇటు జేఈఈ మెయిన్‌తోపాటు ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పూర్తిగా మారే అవకాశమున్నది. ఇంటర్ పరీక్షల తేదీలపై మంగళవారం నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అయితే జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో మంత్రిని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ కలిశారు. పలు అంశాలను చర్చించారు.