Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీలు ఏర్పాటు చేయండి..ఆస్పత్రులు కట్టించండి
- గంటన్నరపాటు సమస్యల్ని విన్నవించిన 40 మంది సభ్యులు
- అసెంబ్లీ జీఆరోఅవర్పై రాతపూర్వక సమాధానాలివ్వండి
- మంత్రులకు స్పీకర్ పోచారం ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒకవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులందరూ విద్యా, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని శాసనసభ లోపల, బయటా అదే పనిగా ప్రకటిస్తున్నారు. అందుకు భిన్నంగా మరోవైపు అదే అధికార పార్టీకి చెందిన అత్యధిక మంది సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో కళాశాలలు కట్టించాలనీ, ఆస్పత్రులు నిర్మించాలని సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు. రెండుమూడేండ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తున్నది. తాజాగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం టీఆర్ఎస్ సభ్యులు ఇవే అంశాలను మరోసారి సభలో ఏకరువు పెట్టారు. తక్షణం విద్యా,వైద్య రంగాలను పటిష్టం చేయాలని వారు విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. మరోవైపు జీరో అవర్‌లో అడిగే ప్రశ్నలకు నోట్ చేసుకున్నాం.. పరిశీలిస్తాం.. అని చెబితే సరిపోదనీ, వాటిపై రాతపూర్వక సమాధానాలు ఇవ్వాలని మంత్రులను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జీరో అవర్‌లో 40 మంది దాకా సభ్యులు తమ నియోజకవర్గాల్లోని, రాష్ట్రంలోని సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అందులో అధికార పార్టీకి చెందిన సభ్యులే ఎక్కువగా ఉన్నారు. ఇంటర్, డిగ్రీ కళాశాలలు లేక తమ నియోజకవర్గాల్లోని పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు చదువులకు దూరం అవుతున్నారనీ, కాబట్టి వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని అధికార పార్టీ సభ్యులు ఏకరువు పెట్టారు. మరికొందరు సభ్యులు పీహెచ్‌సీలు, వైద్యసౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారని సభలో ప్రస్తావించారు. ఎంఐఎం సభ్యులు పాతబస్తీలోని సమస్యలను ఎత్తిచూపారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల్ని నోట్ చేసుకున్నామనీ, పరిశీలిస్తామనీ, ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామనిమంత్రులు సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజరుకుమార్, నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు సభలో చెప్పారు.
కాలేజీల కోసం మొర
ప్రభుత్వ విప్ బాల్కసుమన్ జీఆరో అవర్‌లో మాట్లాడుతూ.. 'మందమర్రిలో డిగ్రీ కళాశాల పెట్టాలి. పీజీ కాలేజీ పెట్టాలి. అమ్మాయిలు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌కు ఉన్నత చదువుల కోసం వెళ్లలేక విద్యకు దూరం అవుతున్నారు. సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి. 44 ఎకరాల ఖాళీస్థలం కూడా ఉంది. ఆ రెండు కళాశాలలు ఏర్పాటు చేస్తే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది' అని సభకు విన్నవించారు. టీఆర్ఎస్ సభ్యులు ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగానూ ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేదనీ, దీంతో వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చదువుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని వాపోయారు. తాము లేవనెత్తిన సమస్యల్ని మంత్రులు నోట్ చేసుకుంటున్నామని చెబుతున్నారుగానీ పరిష్కారం కావట్లేదనీ, రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ సభ్యులు అబ్రహం మాట్లాడుతూ..తమ నియోజకవర్గంలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉందనీ, డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని చెప్పారు. ఒకవేళ దగ్గరలోని కర్నూల్ వెళ్లి చదివినా నాన్‌లోకల్ అవుతున్నారనీ, ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని సభను కోరారు. సండ్రవెంకటవీరయ్య మాట్లాడుతూ..తల్లాడ, వేంసూర్లో ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేయాలనీ, సత్తుపల్లిలోని రేకుల షెడ్డులో కొనసాగుతున్న కళాశాలకు పక్కాభవనాన్ని నిర్మించాలని విన్నవించారు. సభ్యులు జాజుల సురేందర్ మాట్లాడుతూ..ఎల్లారెడ్డిలో ఇంటర్క్లా సులు ప్రారంభించాలని కోరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ..తన నియోజకవర్గంలోని 9 మండలాలుండగా ఒక్క డిగ్రీ కళాశాల కూడా లేకపోవడంతో ఆడబిడ్డలు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల కోసం పదెకరాల భూమి ఇచ్చినా ఇప్పటికీ కళాశాల ఏర్పాటు చేయలేదనీ, వెంటనే సమస్యని పరిష్కరించాలని వేడుకున్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.
వైద్యసౌకర్యాలు లేక ఇక్కట్లు..పీహెచ్‌సీలు,
ఆస్పత్రులు ఏర్పాటు చేయించండి...
అధికార పార్టీ సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఏజెన్సీలో గల తన నియోజకవర్గంలోని గ్రామాలు ఒకదానికొకటి చాలా దూరంగా ఉండటం సమస్యగా మారిందనీ,సరైన వైద్యసౌకర్యాలు లేక ఇప్పలపల్లి లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. తన నియోజకవర్గానికి మాతాశిశు కేంద్రాన్ని కేటాయించా లని విజ్ఞప్తి చేశారు. రెడ్యానాయక్ మాట్లాడుతూ..మరిపెడ మున్సిపాలిటీలో పీహెచ్సీ మూతబడి ఉందనీ, దీంతో వైద్యం చేయించుకోవడానికి ఖమ్మం, మహబూబాబాద్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విడమర్చి చెప్పారు. నర్సింహులపేటలో పీహెచ్సీ శిథిలావస్థలో ఉందనీ, భవనం మంజూరు చేయాలని కోరారు. అందులో సిబ్బందే లేరని చెప్పారు.నోముల భగత్ మాట్లాడు తూ..హాలియాలోని ఆస్పత్రిలో పోస్టుమార్టం కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అక్కడ అది లేకపోవడం వల్ల మృతదేహాలను నల్లగొండకు తరలించి వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. తిరుమలగిరి, పెద్దవూర పీహెచ్సీ సెంటర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..పోచంపల్లిలోని శిథిలావస్థలోని పీహెచ్సీ స్థానంలో నూతన భవనాన్ని మంజూరు చేయాలనీ, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..ఆర్ఎంపీ, పీఎమ్పీలకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా పోస్టుల్లో, వైద్యసేవల్లో రాష్ట్ర సర్కారు వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
బెటాలియన్ నిర్వాసితులకు న్యాయం చేయండి : సీతక్క
కాంగ్రెస్ సభ్యులు డి.అనసూయ(సీతక్క) మాట్లాడుతూ..ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఐదో బెటాలియన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదనీ, దానికి ఐదొందల ఎకరాలు సేకరించగా అందులో పేదలదే 200 ఎకరాలు ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో మున్నేరు వాగుపై ఆనకట్ట కట్టాలని విన్నవించారు. దానిని పూర్తిచేస్తే ముదిగొండ, చింతకాని మండలాలకు సాగునీటి అందించొచ్చని సూచించారు. హైడ్రోలాజికల్, అటవీ శాఖ, ఇంటర్‌స్టేట్ అనుమతులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఆరోజోన్లో 2009 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదో జోన్‌లోని 2012 ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఆరేండ్లు దాటితేనే ఎస్ఐలకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, 12 ఏండ్లు అవుతున్నా ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఇతరత్రాలు..
20వేల మందికిపైగా ఉన్న వీఆర్ఏలకు పేస్కేలు ఇవ్వడంతో పాటు వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీ సభ్యులు జి.విఠల్‌రెడ్డి కోరారు.ఇంటి స్థలం వీఆర్ఏలకు ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేయాల ని సభకు విజ్ఞప్తి చేశారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యులు డి.శ్రీధర్‌బాబు కోరారు. మేడిగడ్డ అన్నారం నుంచి లిఫ్టుచేసే సమయంలో పలు గ్రామాల్లోని నీటి వరద పోతున్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.తమను పర్మినెంట్ చేయాలనీ, రిటైర్డ్ బెనిఫి ట్స్ ఇవ్వాలని అంగన్వాడీలు అడుగుతున్న నేపథ్యంలో వారి సమస్యను పరిష్కరించాలని టీఆర్ఎస్ సభ్యులు గణేష్‌గుప్తా కోరారు. అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..నారాయణఖేడ్‌లో పేదలకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం అవుతున్నదనీ,దానిని కాపాడాలని సభకు విన్నవించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, సాదాబైనామాలు, ఇండ్లస్థలాల సమస్యలను పరిష్కరించాలని సభ్యులు హరిప్రియ, కాలె యాదయ్య, ఆర్.రమేశ్ కోరారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు న్యాయం చేయాలని సైదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రహదారుల మూసివేతతో తలెత్తుతున్న సమస్యలను సివిల్ మిలిటరీ లైజాల్ కమిటీ ద్వారా పరిష్కారించాలని సభను టీఆర్ఎస్ సభ్యులు సాయన్న వేడుకున్నారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. లారీ ఓనర్లు బ్యాంకుల నుంచి అప్పులు, లోన్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారనీ, ఏపీకి వెళ్తే ప్రతి టిప్పుకు రూ.1600 వసూలు చేయడం భారంగా మారిందని తెలిపారు. ఏపీకి వెళ్లే లారీలకు ఏడాదికి ఓ ఐదువేలు నిర్ణయించాలని సూచించారు. పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ..నాపరాయి, శుద్ధ గనుల మైనింగ్ లీజ్‌లను రెన్యూవల్ చేయాలని విన్నవించారు. రామగుండం ఎన్టీపీసీ యాష్‌పాండ్‌తో పలు గ్రామాలు బూడిదమయం అవుతున్నాయనీ, ఆ గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. తమ నియోజకవర్గ కేంద్రానికి పాలిటెక్నిక్ కాలేజీ ఇవ్వాలని విన్నవించారు.