Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలపట్టుకుంటున్న రైతులు
నవతెలంగాణ - మెఫిసిల్ యంత్రాగం
ఈ ఏడాది ఏ పంట తీసుకున్నా నష్టాలలోనే రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. అది మాగాణి, మెట్ట, ఉద్యాన... పంటలేవైనా రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఈ నష్టాలు కూరగాయ పంటలను సైతం వదిలి పెట్టలేదు. ప్రస్తుతం టమాట రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రెండు నెలల కిందట సామాన్యులకు అందనంత ధర పలికిన టమాట ఒక్కసారిగా అమాంతం పడిపోయింది. దిగుబడులు సరిగా లేని సమయాన సాధారణంగా టమాట ధరలు అధికంగా ఉండాలి. కానీ దీనికి భిన్నంగా ప్రస్తుతం పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. వివిధ రకాల కారణాలతో పంట దిగుబడులు తగ్గాయి. కొన్నిచోట్ల తామర పురుగు ధాటికి టమాట రైతు తీరని నష్టాలను చవిచూశాడు అయితే, రెండునెలల క్రితం రైతుబజార్లో కిలో రూ.60 నుంచి 80 పైగా వరకు పలికిన టమాట ప్రస్తుతం రూ.14 మాత్రమే పలుకుతోంది. హౌల్సేల్ మార్కెట్లో25 కేజీల వరకు ఉండే బాక్స్ (కేస్) నవంబర్, డిసెంబర్ నెలల్లో రూ.250 వరకు పలకగా ఇప్పుడు రూ.80- 100 వరకు మాత్రమే పడుతోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. టమాటను మార్కెట్కు తరలిస్తే అక్కడ లభించే ధర.. రవాణా చార్జీలకు కూడా సరిపోవడం లేదంటున్నారు.ఈ ఏడాది రబీలో వరి వేయొద్దనడంతో గతం కంటే అధికంగా రైతులు కూరగాయ సాగు చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. గతేడాది 0.57 లక్షల హెక్టార్లలో టామాట పంట సాగైంది. మెదక్లో 14 వేలు, మహబూబ్నగర్లో15 వేలు, రంగారెడ్డిలో నాలుగు వేలు హెక్టార్లు, నల్లగొండలో వందల ఎకరాల్లో సాగైంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో 13వేల ఎకరాల్లో కూరగాయ పంట వేయగా ఈ ఏడాది (2021-22) 16వేల ఎకరాల్లో సేద్యం చేశారు. దీనిలో దాదాపు 30% వరకు టమాట పంట ఉందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది 8వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయగా..ఈ సంవత్సరం 10వేల ఎకరాల్లో వేశారు. ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం 5వేల ఎకరాల్లో కూరగాయ పంటలు వేయగా ఈ ఏడాది ఆరువేల ఎకరాల్లో సాగు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 15 వేల ఎకరాల్లో టమోటను సాగు చేస్తున్నారు. వీటి సాగుకోసం ఎకరాకు రూ.25 వేల వరకు ఖర్చు చేశారు. దిగుబడి 80 క్వింటాళ్లు వచ్చేది. ఈ సారి మాత్రం 40 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. రసాయనిక ఎరువుల వాడకాన్ని పెంచినా ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటల దిగుబడి ఆశించిన రీతిలో లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రైతుల వద్ద వ్యాపారులు కిలో రూ.4-5 లకు కొనుగోలు చేసి మార్కెట్లో పది రూపాయలకు అమ్ముకుంటున్నారని నల్లగొండ రైతులు అంటున్నారు. టమాట పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి సుమారు రూ. 30 వేల వరకు పంటకోసం పెట్టినా పెట్టుబడి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేసారి దిగుబడితో ధరల పతనం
తెగుళ్లతో దిగుబడి పడిపోయినా ఉన్న కొద్దిపాటి పంట కూడా ఒకేసారి దిగుబడి వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయని హౌల్సేల్ కూరగాయ మార్కెట్ కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. ఖమ్మం హౌల్సేల్ మార్కెట్కు అన్సీజన్లో కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్నూల్ నుంచి దిగుమతి చేసుకునే వారు. ఈ ఏడాది ఛత్తీస్గఢ్ రైతులకు టమాట లాభాల పంట పండించిందంటున్నారు. అక్కడి రైతులు బాక్స్ రూ.1,500 వరకు అమ్మినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానిక దిగబడులు మార్కెట్కు వస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి టమాట ఇక్కడికి వస్తోంది. 'రైతులంతా ఒకేసారి పంట వేయడం, దశలవారీగా కాకుండా ఒకేసారి విత్తనాలు నాటడం వల్ల పంట దిగుబడులు ఇప్పుడే వస్తున్నాయి. డిసెంబర్లో వేసిన పంట ఇప్పుడు దిగుబడి వస్తుంది కాబట్టి ధరలు మందగించాయి.' అని అధికారులు చెబుతున్నారు.
గిడ్డంగులు ఏర్పాటు అయ్యేనా...?
ఎంతో కష్టపడి పండించిన పంటలను నిలువ ఉంచుకునేందుకు అవకాశం లేకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామంటున్న పాలకుల హామీలు అమలు కావడం లేదు. తాము పండించిన కూరగాయలను, ఇతర పంటలను నిలువ ఉంచుకోవడానికి వీలుగా జిల్లా కేంద్రంలో శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ రవాణావంటి సౌకర్యాలు లేనందున తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే పంటలను అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాల్లో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. కానీ శీతల గిడ్డంగి మిర్యాలగూడలో ఒక్కటే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
- నెల రోజులు ఇదే పరిస్థితి
తోట రామారావు, కూరగాయల కమీషన్ ఏజెంట్, ఖమ్మం
ప్రస్తుతం హౌల్సేల్ మార్కెట్కు వస్తున్న టమాట అంతా స్థానికంగా పండించిందే. స్థానిక దిగుబడులు వస్తుండటంతో ధర పతనం అవుతోంది. ఈనెల మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. నవంబర్, డిసెంబర్లో బాక్స్ రూ.300కు పైగా పలికింది. ప్రస్తుతం రూ.80-100 వరకు పడుతోంది. ఏప్రిల్ నాటికి ధరలు పుంజుకుంటాయి. అప్పటికీ మన దగ్గర వాతావరణం వేడెక్కడంతో పంట దిగుబడి రాదు. అప్పుడు కర్నాటక, ఛత్తీస్గఢ్ల నుంచి దిగుమతి చేసుకోవాలి. స్థానిక రైతులకు పెద్దగా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. కోత, రవాణా కూళ్లు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.