Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఇండ్లపైన కరెంటు తీగలు లేవనీ, కరెంటు వైర్ల కిందే ఇండ్లున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. తాము కరెంటు లైన్లు వేశాకే ఆయా బస్తీల్లో ప్రజలు ఇండ్లు నిర్మించుకున్నారనీ, ఆర్థికంగా ఎదిగాక మొదటి, రెండు అంతస్తులు కట్టుకోవడంతో ఇండ్లపైకి కరెంటు వైర్ల సమస్య వచ్చిందనీ అన్నారు. అటువంటివి ఏమన్నా ఉంటే, తొలగిస్తామని చెప్పారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, గండ్ర వెంకట రమణారెడ్డి, కోరుకంటి చందర్‌లు రాష్ట్రంలో విద్యుత్‌రంగ స్థితిగతులపై ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా మంత్రి వారికి సమాధానం చెప్పారు. విద్యుత్ జాతీయ తలసరి వినియోగం 1,161 యూనిట్లు కాగా, రాష్ట్రంలో 2,012 యూనిట్లుగా 73 శాతం ఎక్కువగా ఉందన్నారు. విద్యుత్‌రంగంలో ప్రభుత్వ దూరదృష్టికి ఇదే నిదర్శనమని చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల వ్యవస్థాపక సామర్థ్యం ఉండగా, ఇప్పుడది 17,305 మెగావాట్లకు పెరిగిందన్నారు. అప్పట్లో సోలార్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉన్నదనీ, ఇప్పుడు 4,430 మెగావాట్లకు పెంచామని చెప్పారు. 2014లో పీక్ అవర్ డిమాండ్ 5,560 మెగావాట్లు కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న 13,688 మెగావాట్లకు పెరిగినా గ్రిడ్‌ను సమర్ధవంతంగా నిర్వహించామన్నారు. స్వరాష్ట్రంలో రూ.34వేల కోట్లతో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేశామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే 400 కేవీ సబ్స్టేషన్లు 17తో పాటు 220 కేవీ సబ్స్టేషన్లు 46, 132 కేవీ సబ్స్టేషన్లు 68 అదనంగా నిర్మించామన్నారు. 10,798 సర్క్యూటెడ్ లైన్లను కొత్తగా ఏర్పాటు చేశామని వివరించారు. జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో 300 మెగావాట్ల కొత్త విద్యుత్కేంద్రాలను నిర్మించామనీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో రివర్సబుల్ టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 16.50 శాతం నుంచి 11 శాతానికి తగ్గాయన్నారు. డిస్కంల అప్పుల అంశాన్ని సభ్యులు అడిగినా, మంత్రి దానికి సమాధానం చెప్పలేదు.