Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య 10:7 నిష్పత్తిలో పంపిణీ చేసేందుకువీలుగా కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయం కృష్ణావాటర్ డిస్ట్రీబ్యూటరీ ట్రిబ్యునల్-1లోని నిబంధనలను ఉల్లంఘించడమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయమై మంగళవారం రాష్ట్ర సాగునీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజీనీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ కేఆర్ఎంబీ చైర్మెన్‌కు లేఖ రాశారు. కృష్ణానదిపై నిర్మిస్తున్నది రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ మాత్రమేననీ, అది డిస్ట్రీబ్యూటరీ స్కీమ్ కాదని స్పష్టం చేశారు. ఈ పథకం నుంచి తెలంగాణ వాటాగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని గత మూడు దశాబ్దాలుగా పొందలేకపోతున్నామని తెలిపారు. రాజోలిబండ ఆనకట్టను కేఆర్ఎంబీ తన పరిధిలోకి తీసుకుని తెలంగాణ వాటా జలాలను కేటాయించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో ఆర్డీఎస్ ఆనకట్ట తనిఖీ, అధ్యయనానికి కేఆర్ఎంబీ బృందం వెళ్లిన సందర్భంలో ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వైపు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా నది నుంచి ఏమేరకు ఇసుక మేటు వేసింది తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆర్డీఎస్ ఆనకట్ట పూర్తిసామర్ధ్యానికి నీటిమట్టం చేరినప్పుడు ఆర్డీఎస్ కేనాల్, కామన్ కెనాల్ సామర్థ్యం మేరకు 770 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా పరిస్థితులు ఉన్నాయా ? లేదా ? అని కూడా పరిశీలించాలని కోరారు. ఆర్డీఎస్ ఆధునిక పనుల్లో భాగంగా ఆర్డీఎస్ ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టిఎల్) పెంచే అవకాశం ఉంటే పరిశీలించాలనీ, ఆ మేరకు డిజైన్లను రూపొందించాలని లేఖ ద్వారా సూచించారు.