Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో పాడి కౌశిక్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బడుగులు బాహుబలి సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన కింద ఆయన మాట్లాడుతూ రైతుబంధు కింద బీసీలు 32 లక్షలు, ఎస్సీలు ఎనిమిది లక్షలు, ఎస్టీలు ఏడు లక్షలు, ఇతరులు 12 లక్షల మంది లబ్దిపొందుతున్నారని వివరించారు. దళితబంధు పథకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు లాంటి వారు విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడొద్దని చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనకు సూచించారు. అనంతరం కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా హుజూరాబాద్‌లో 20 వేల మంది దళితులుంటే 18 వేల మంది అకౌంట్లలో రూ.పది లక్షల చొప్పున నిధులు జమ అయ్యాయనీ, రాష్ట్రంలోని నాలుగు మండలాల్లోనూ ఆ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నదని వివరించారు. బండి, గుండు వంటివారు దళితబంధు మీద తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు. అన్‌పార్లమెంటరీ పదాలను వాడొద్దంటూ చైర్మెన్ మరోసారి ఆయనకు సూచించారు. రాబోయే కాలంలో కేసీఆర్ దేశానికే సింహం అవుతారంటూ కౌశిక్‌రెడ్డి అనడంతో చైర్మెన్ సహా అందరూ నవ్వారు.రాష్ట్రంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందంటూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,సర్కారు బడు ల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పటిష్టంగా అమలు చేయా లంటూ తక్కళ్లపల్లి రవీందర్రావు, కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలనీ, సిబ్బంది కొరతను తీర్చాలని విఠల్, డిజిటల్ లైబ్రరీలు, పోటీపరీక్షల కోసం మెటీరియల్‌ను అందుబాటులోకి తేవాలనీ, గ్రంథాలయాలను మెరుగుపర్చాలని వాణీదేవి ప్రత్యేక ప్రస్తావన కింద కోరారు. వాటిని పరిశీలిస్తామని మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
పోడుసాగుదార్లకు పట్టాలివ్వాలి : జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో పోడు భూములను సాగుచేసుకుంటున్న ఆదివాసీలు, ఇతరులకు పట్టాలివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టాలిస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దానిపై ప్రభుత్వం ఇంతవరకు సరైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అటవీ భూముల సరిహద్దులో ఉన్న రెవెన్యూ భూములను సాగుచేసుకుంటున్న వారికి పట్టాలున్నాయనీ, రైతుబంధు వస్తున్నదని వివరించారు. అయినా అటవీ అధికారులు దాడులు చేయడం సరైంది కాదన్నారు. పట్టాలున్న భూమిని సాగు చేస్తున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలనీ, కలెక్టర్లకు తగు ఆదేశాలివ్వాలని కోరారు.