Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే వాటిని సవరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సామాజిక భద్రత కోడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూల్స్‌లో కార్మికులకు నష్టం చేకూర్చే అంశాలు అనేకమున్నాయనీ, వాటిని వెంటనే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ సంక్షేమ భవన్లో ఆ శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్‌కు తమ అభ్యంతరాలతో పాటు పలు సవరణలు సూచిస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..కార్మికవర్గం అనేక పోరాటాలతో తమ సామాజిక భద్రత కోసం సాధించుకున్న 9 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో సోషల్ సెక్యూరిటీ కోడ్ తెచ్చిందనీ, అందులో కార్మికవర్గానికి నష్టం కలిగించే అంశాలున్నాయని వాటని సవరించాలని కోరారు. గతంలో తాము సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే కోడ్‌ను అమల్లో తేవడం సరిగాదన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ బెనిఫిషియర్స్లో ప్రతిపాదించిన ఫీజులను ఎత్తేయాలనీ, రిజిస్ట్రేషన్ పొందాలంటే రూ.30, కార్డు రెన్యూవల్ కోసం రూ.20, కార్డుకు రూ.10 ఫీజు విధించడం సరిగాదని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఇచ్చే పరిహారం విషయంలో నామినితోపాటు తీసుకునే స్టేట్మెంట్లో మతం చెప్పాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఒక పరిశ్రమలోగానీ, సంస్థలోగానీ 50 మంది మహిళా ఉద్యోగులుంటే క్రెచ్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ యొక్క విధివిధానాలను పొందుపర్చాలని కోరారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్టులో ఉన్న దానిని యధాతథంగా కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం ఏర్పాటు చేసే బోర్డులో ఎంత మంది ఉంటారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్ రూల్స్‌లోని పేజీ నెం.8, ఐటెమ్ నెం.21లో కొన్ని పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తామని ఉందనీ, దానిని ప్రభుత్వమే నిర్వహించేలా సవరణ చేయాలని కోరారు. టీఎస్ రూల్స్‌లోని పేజీ నెం.42లోని ''సోషల్ సెక్యూరిటీ ఫర్ అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్'' అన్న చాప్టర్లో కేంద్ర కోడ్‌లోని సెక్షన్ 109(1), 109(2), సెక్షన్ 110, 112ను కూడా నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు.