Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు, తెలంగాణ (వ్యవసాయోత్పత్తి, జీవధన) మార్కెట్ల చట్టం-1966ను సవరణ బిల్లులను శాసనమండలి మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎఫ్ఆర్బీఏం సవరణ బిల్లును ఆర్థిక మంత్రి టి హరీశ్‌రావు ప్రతిపాదించారు. ఎఫ్ఆర్బీఎం ప్రకారం ప్రస్తుతం 3.5 శాతం అప్పులు తెచ్చుకునేందుకు అవకాశముందని వివరించారు. దాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతానికి పెంచేలా సవరణను ప్రతిపాదిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.లక్ష కోట్లు రుణం ఇవ్వాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అందులోనూ ఎక్కువ రుణం పొందేందుకు ఈ సవరణ చేస్తున్నామని చెప్పారు. ఈ రుణాలనూ కేంద్రం, ఆర్బీఐ నిబంధనలకు లోబడే తీసుకుంటామని అన్నారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ (వ్యవసాయోత్పత్తి, జీవధన) మార్కెట్ల చట్టం-1966ను సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదించారు. మార్కెట్ కమిటీలో సభ్యులు ప్రస్తుతం 14 మంది ఉన్నారనీ, ఆ సంఖ్యను 18కి పెంచుతున్నామని వివరించారు. పాలకమండలి కాలపరిమితి ప్రస్తుతం ఏడాది వరకే ఉందనీ, దాన్ని రెండేండ్లకు పెంచుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని మార్కెట్ కమిటీల ద్వారా కొనాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలతోపాటు మహిళలూ చైర్మెన్లు అయ్యారని గుర్తు చేశారు. కానీ జీవన్‌రెడ్డి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, రాజకీయాలు మాట్లాడ్డం దురదృష్టకరమని అన్నారు. మరో సభ్యుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీలే వద్దంటూ కేంద్రం వ్యవసాయ చట్టాలు తెచ్చిందని గుర్తు చేశారు. రైతుల పోరాటంతో కేంద్రం వెనక్కి తగ్గిందనీ, ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను ఉపసంహరించుకున్నారని అన్నారు. రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పడం ఆచరణలో సాధ్యం కాదన్నారు. ఈ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అనంతరం మార్కెట్ల చట్టం సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినట్టు చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.