Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. అనుకున్నట్టే వారం రోజుల్లో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుకొని ప్రభుత్వం సభను వాయిదా వేసుకుంది. గతంలో బడ్జెట్ సమావేశాలు కనీసం 45 రోజులు సాగేవి. ఇప్పుడది తంతుగా మారి 'మమ' అనిపించుకోవడంతో సరిపోయింది. శాసనసభ ఏడు రోజులు నడిస్తే, శాసనమండలి నాలుగు రోజులు మాత్రమే నడిచింది. శాసనసభ మొత్తంగా 54.47 గంటలు నడిచింది. ప్రశ్నోత్తరాల్లో 22 ప్రశ్నలు చర్చకు వచ్చాయి. 88 అనుబంధ ప్రశ్నలు వచ్చాయి. నాలుగు బిల్లులు సభలో ప్రవేశపెడితే, అన్నీ ఆమోదం పొందాయి. నాలుగు రోజలు నడిచిన శాసనమండలిలో ఒకరోజు చైర్మెన్ ఎన్నికతో ముగిసింది. ఆ రోజు బడ్జెట్, పద్దులపై ఎలాంటి చర్చా జరగలేదు. మిగిలిన మూడు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, ఆమోదం పొందిన రోజు మినహాయిస్తే, దానిపై చర్చ జరిగింది కేవలం ఒక్కరోజే! శాసనమండలి నడిచిన నాలుగురోజుల్లో కేవలం 12 గంటల 23 నిముషాలు మాత్రమే కొనసాగింది. శాసనసభ నుంచి బీజేపీ సభ్యులను తొలిరోజే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రభుత్వం తాము చెప్పదలుచుకున్న విషయాలపై మాత్రమే చర్చ, సమాధానాలు ఉండేలా ప్రణాళికాబద్ధంగా సభను నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష స్థానంలోని మిత్రపక్షం ఎంఐఎం సభకు పూర్తిగా సహకరించింది. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఆచితూచి వ్యవహరించారు. ప్రభుత్వంపై ఎలాంటి ఎదురుదాడి చేయలేదు. అధికారపార్టీ సభ్యులు, మంత్రులు మాత్రం 'అప్పట్లో' అంటూ మొదలు పెట్టి, కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేలా ప్రసంగాలను కొనసాగించారు. కనీసం దానిపై ఎదురుదాడి కూడా కాంగ్రెస్ చేయలేకపోయింది.