Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె పొరపాటని సీఎం అనటం సరికాదు : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విధుల్లోంచి తొలగించిన నాటి నుంచి అలుపెరుగని పోరాటాలు చేయడం ద్వారానే ఫీల్డు అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 14 ఏండ్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా తొలగించిందనీ, రెండేండ్ల సుదీర్ఘపోరాటంతో మళ్లీ వారిని విధుల్లోకి తీసుకున్నదని పేర్కొన్నారు. వారి పోరాటాన్ని అణచివేసేందుకు పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఫీల్డు అసిస్టెంట్ల పోరాటానికి సీఐటీయూ అన్ని స్థాయిల్లోనూ అండగా నిలించిందని తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనరేట్, ఇందిరాపార్కు వద్ద ధర్నా, కలెక్టరేట్ల ముట్టడి, మూడు రోజుల కింద మంత్రుల బహిరంగ సభ అడ్డగింతతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అయిందని పేర్కొన్నారు. శాసనసభలో వారిని విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో సమ్మెలాంటి పొరపాటు మరోసారి చేయొద్దని ఆయన అనటం తగదని హితవు పలికారు. హక్కుల కోసం పోరాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలిపారు. బుధ, గురువారాల్లో పోరాడి విజయం సాధించిన కార్మికులందర్నీ జిల్లా కేంద్రాల్లో సమీకరించి అభినందన సభలు జరపాలని పిలుపునిచ్చారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యమాభివందనాలు..సీఎంకు ధన్యవాదాలు
తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్
రాష్ట్ర సర్కారుపై రెండేండ్లు పోరాడి విజయం సాధించిన ఫీల్డ్ అసి స్టెంట్లకు ఉద్యమాభివందనాలనీ, వారిని తిరిగి విధుల్లోకి తీసుకుం టామని శాసనసభలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలు పుతున్నామని తెలంగాణ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు భూపాల్, ఎం.సత్యనారాయణగౌడ్ తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డు అసిస్టెంట్లు రెండేండ్లుగా పోరాడు తూనే ఉన్నారని తెలిపారు. కలెక్టరేట్ల ముట్టడిలు, ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం, వివిధ రూపాల్లో నిరసనలు చేశామని తెలిపారు. సుమారు 70 మంది చనిపోయారని వాపో యారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర సర్కారు ఆదుకోవాలని కోరారు.