Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లష్కర్లుగా వీఆర్ఏలు..
- వివిధ శాఖల ఖాళీల్లోకి వీఆర్ఓలు..
- అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది మధ్యాహ్న భోజన కార్మికుల పారితోషికాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.వెయ్యి ఇస్తున్నారనీ, దాన్ని రూ.3వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు ఈ అంశాన్ని సభలో ప్రస్తావించారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వీఆర్ఏ, వీఆర్ఓ ల అంశాన్ని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రస్తావించగా, సీఎం కేసీఆర్ దానికి వివరణ ఇచ్చారు. వీఆర్ఏలను నీటి పారుదల శాఖలో లష్కర్లుగా ఆప్షన్ ఇచ్చి నియమిస్తామని చెప్పారు. వీఆర్ఓలను ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి స్కేల్‌ను బట్టి వారిని అడ్జెస్ట్ చేస్తామని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో ఇబ్బందులను తొలగిస్తున్నామని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటు పేరుతో కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని లాగేసుకొనే ప్రయత్నంచేస్తున్నదని విమర్శించారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల అన్యాక్రాంతం అంశంపై నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందలేదనీ, అది రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. జీవో 111 ను రద్దు చేస్తామన్నారు. ఈ జీవో పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉందనీ, ఇక్కడ కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించి, అమల్లోకి తేవాలని పురపాలకశాఖ, హెచ్ఎండిఏను ఆదేశించినట్టు తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్‌ను కాపాడుతూ నూతన భవన నిర్మాణాలు చేపట్టాలనీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి దీనికి సంబంధించిన బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు.