Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్య దళారీల నుంచి రైతులను కాపాడాలి :
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మార్కెట్ కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కందులను కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఆయన లేఖ రాశారు. 2021 వానాకాలంలో కంది పంట 8,98,360 ఎకరాల్లో వేస్తే 16.01 లక్షల టన్నుల ఉత్పత్తిని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం నిరంతరం చెప్పడంతో చాలా మంది రైతులు ఆ పంటవైపు మళ్లారని పేర్కొన్నారు. ఆశించిన దిగుబడులు వచ్చాయని వివరించారు. కేంద్రం క్వింటాల్ కందులకు రూ.6,300 కనీస మద్దతు ధరను ప్రకటించిందని గుర్తు చేశారు. రైతులు మార్కెట్‌కు వస్తే పౌరసరఫరాల శాఖ కొనకపోవడంతో ప్రయివేటు వ్యాపారస్తులు క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ఏటా 11.68 లక్షల టన్నుల పప్పులు వినియోగిస్తున్నారని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించిందని వివరించారు. అయితే రాష్ట్రంలో ఐదు లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నదనీ, మరో 6.68 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. క్వింటాల్ కందులను పప్పుగా మారిస్తే 80 కిలోలు వస్తుందని తెలిపారు. కిలో పప్పు మార్కెట్లో రూ.120 ఉందని వివరించారు. 80 కిలోలకు రూ.9,600 ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ రైతులకు క్వింటాల్‌కు రూ.5 వేల వరకు వస్తున్నదని తెలిపారు. అందువల్ల పౌరసరఫరాల శాఖ ద్వారా కందులను కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలనీ, మధ్యదళారీల నుంచి రైతులను కాపాడాలని కోరారు.