Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకుడిగా, విలేకరిగా సమాజానికి ఎంతో సేవ :
- రజక వృత్తిదారుల సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య
- సీపీఐ(ఎం) పార్టీకి తీరని లోటు: పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా
'నవతెలంగాణ' విలేకరి వెంకన్న: సంతాప సభలో వక్తలు
- సంతాపం తెలిపిన సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధాభాస్కర్, జీఎం సుబ్బారావు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందిన రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దోనేపల్లి వెంకన్న ఆశయ సాధనతో ముందుకెళ్లాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య అన్నారు. విలేకరిగా, నిజాయితీ గల నాయకుడిగా వెంకన్న సమాజానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఖమ్మం జిల్లా స్వగ్రామం తిరుమలాయపాలెం మండలం జూపెడలో వెంకన్న అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. మృతదేహాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు పి.సోమయ్య, 'నవతెలంగాణ' దినపత్రిక జీఎం ఎం.సుబ్బారావుతో కలిసి ఆశయ్య సందర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో వెంకన్న రజకవృత్తిదారులు, విలేకరిగా సమాజానికి చేసిన సేవలను ఆశయ్య గుర్తు చేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, పార్టీ ప్రతిష్ట పెంచిన వ్యక్తి వెంకన్న అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సోమయ్య అన్నారు. అటు రజకవృత్తిదారుల కోసం, ఇటు కామేపల్లి మండల పార్టీ బాధ్యతలు, ప్రస్తుతం తిరుమలాయపాలెం మండల బాధ్యతలు నిర్వహిస్తూ 'నవతెలంగాణ' విలేకరిగానూ వెంకన్న విశేష సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. 'నవతెలంగాణ' దినపత్రిక జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ.. మంచి విలేకరిగా వెంకన్న గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, బషీర్, మండల కాంగ్రెస్ నాయకులు మందడి ఇజ్రాయిల్, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు కొల్లేటి నాగేశ్వరరావు, తిమ్మిడి హనుమంతరావు, సీపీఐ(ఎం) జిల్లా, మండల కమిటీతో పాటు 'నవతెలంగాణ' సిబ్బంది, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, తిరుమలాయపాలెం మండల విలేకరులు, రజక వృత్తిదారుల సంఘం, డీవైఎఫ్ఐ నాయకులు సంతాపం తెలిపారు.
నవతెలంగాణ యాజమాన్యం సంతాపం
తిరుమలాయపాలెం విలేకరి దోనేపల్లి వెంకన్న మృతిపట్ల 'నవతెలంగాణ' దినపత్రిక చీఫ్ జనరల్ మేనేజర్ ప్రభాకర్, ఎడిటర్ సుధాభాస్కర్ సంతాపం తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.