Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలిలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు చెల్లించే రెమ్యునరేషన్ చెల్లింపులో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఇ-కుబేర్‌లో పెండింగ్ ఉన్న బిల్లులన్నింటిని మార్చి 31లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్, పార్ట్ ఫైనల్స్, లోన్ చెల్లింపులను కూడా పెండింగ్ లేకుండా చెల్లించాలనీ, పెండింగ్‌లో ఉన్న చెక్కులను మార్చి 31లోగా చెల్లించాలని సూచించారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష తదితర సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని నర్సిరెడ్డి మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు.
అభినందనలు
మధ్యాహ్న భోజన వర్కర్లకు పారితోషికాన్ని రూ.మూడు వేలకు పెంచినందుకు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మెప్మా సిబ్బందిని తిరిగి తీసుకుంటానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల నర్సిరెడ్డి అభినందనలు తెలిపారు.
కేంద్రానికి పథకాలెందుకు...?
విద్యా, ఆరోగ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలను రద్దు చేసుకోవాలని అలుగుబెల్లి సూచించారు. ఆ పథకాలకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు గ్రాంటు రూపంలో నిధులిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రెండు పథకాలను ఏక కాలంలో అమలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని తెలిపారు. వ్యవసాయరంగంలోనూ ప్రధానమంత్రి కిసాన్ ఆవాజ్ యోజన రైతు బంధుకు అడ్డంకిగా మారిందన్నారు. ఈపీఎఫ్ వడ్డీ రేట్లను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు.