Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారు
- ఈ బడ్జెట్లో సుమారు లక్ష కోట్లు ఆదాయ లోటు!
- ఐదు లక్షల కోట్లకు చేరనున్న రాష్ట్ర అప్పులు
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఏడు రోజులకే పరిమితం చేయడం వల్ల బడ్జెట్‌పై అర్థవంతమైన చర్చ జరగలేదని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం శాసనసభ ముగిసిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. శాసన సభలో ప్రజా సమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారని, లోతైన చర్చ జరుగకుండా సమయం చాలా తక్కువగా ఇచ్చారని అన్నారు. 2021-22 బడ్జెట్లో రూ.50-60 వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోందని, మరో రూ.50 వేల కోట్లు అప్పులు తెస్తామని చెప్పారని అన్నారు. ఆ లెక్కన బడ్జెట్లో సుమారు రూ.లక్ష కోట్లు ఆదాయ లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. 2024-25 సంవత్సరం నాటికి రాష్ట్ర అప్పులు రూ.5లక్షల కోట్లు దాటడం ఖాయమన్నారు. ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల 70వేల కోట్లు దాటిందన్నారు. మూడేండ్ల కిందట రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడినప్పుడు సర్కార్ మమ్మల్ని అవహేలన చేసిందని, ఆ రోజు మేం చెప్పిందే ఇప్పుడు స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ దాటడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలపై పెను భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తి ప్రశ్నించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాట్లడనివ్వకుండా అడ్డుపడ్డారని, అధికారపార్టీ సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ రెచ్చగొట్టడం, సభను పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి సమావేశాలను ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీలో చెప్పామని, 15న చెప్తామన్న ప్రభుత్వం సమావేశాలను వాయిదా వేయడం సరికాదన్నారు. రైతుబంధు ఒకటే కాదు.. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వడ్డీలేని రుణాలు, సబ్సిడీ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లు కొనసాగించాలని, నిరుద్యోగ భృతి గురించి అడిగితే సర్కార్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ తరుపున ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేశామని, వాళ్లను తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని అన్నారు. ఐకేపీ, మెప్మా సిబ్బందికి పే స్కేలు ఇచ్చేలా ఒప్పించగలిగామని, వీఆర్ఏల సమస్యల గురించి ఆలోచిస్తామన్నారు.
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాలు శాసనసభ చరిత్రలోనే ఇంత తక్కువ రోజులు ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. పద్దులపై అర్థవంతమైన చర్చ జరగలేదన్నారు. తాము లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అతి త్వరలోనే పెంచే ప్రమాదం ఉందని, దాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు. రెండు డిస్కంల డెవలప్మెంట్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించలేదన్నారు. యాసంగి పంట కొనుగోలు చేయాలని డిస్కర్షన్లో పెట్టిన మా ప్రశ్నకూ ప్రభుత్వం జవాబు చెప్పలేదన్నారు. కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందన్నారు. 2019-20లో ఆర్థిక మిగులు సాధించలేకపోయారని కాగ్ చెప్పిందని, ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరవాలన్నారు. 97శాతం ద్రవ్యలోటు పూడ్చుకోవడానికి మార్కెట్ ద్వారానే రుణాలు తీసుకొస్తుందని చెప్పారు. గతేడాది కంటే ఈ బడ్జెట్లో విద్యకు తక్కువగా నిధులు కేటాయించారన్నారు. ఏడేండ్లలో విద్య, వైద్యానికి తక్కువ కేటాయించారని కాగ్ తెలిపిందని, ఉదయ పథకం కింద తీసుకున్న 4వేల కోట్ల అప్పు చెల్లించలేకపోయారని చెప్పారు.