Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందించిన తాత్కాలిక సిబ్బందికి రెగ్యులర్ నియామకాల్లో వెయిటేజీ కల్పించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ, సభలోని సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తుంటాయనీ, అలాంటిది కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నుంచి కూడా అభినందనలు వచ్చాయని తెలిపారు. ధరణికి సంబంధించి ఇప్పటికే కొన్నిఆప్షన్లపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో చర్చించామనీ, సభ్యుల నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పాడి పరిశ్రమకు ఇన్సెంటివ్ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో 15 నుంచి నెల రోజుల్లో క్యాథల్యాబ్ సేవలు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలకు విధులకు వెళ్లిన నర్సులను తిరిగి డిప్యూటేషన్‌పై రప్పిస్తామని చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల వారితో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఈపీఎఫ్ వడ్డీ రేట్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రాన్ని కోరుతామన్నారు. ఉన్నత విద్యలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేసే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమ కళాకారులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ చర్చలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్థన్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, బండ ప్రకాష్, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి నిరవధికంగా వాయిదా పడింది.
అనుభవజ్ఞుల సభ....
శాసనమండలి ఐదుగురు రాష్ట్ర మాజీ మంత్రులు, ముగ్గురు మాజీ ఎంపీలు, మూడంచెల వ్యవస్థలో పని చేసిన చైర్మెన్, మాజీ ప్రధానమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి, డాక్టర్లు తదితర అనుభవజ్ఞులైన సభ్యులతో నిండుగా ఉందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
శిక్షణ అవసరం....కడియం
బడ్జెట్‌పై జరుగుతున్న చర్చ సందర్భంగా సభ్యులు దానిపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకు సంబంధించి సభ్యులకు శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని చైర్మెన్‌కు సూచించారు.