Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి కరీంనగర్లో 2.50లక్షల ఎకరాలపైనే బీడు..
- జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా వరి సాగుకు దూరం
- ఎస్సారెస్పీ నీళ్లందక ఎండుతున్న చి'వరి' మళ్లు
- ఎల్లంపల్లి, మిడ్‌మానేరు నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు..
- బ్యాక్‌వాటర్‌పై ఆధారపడిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం
- వరదకాల్వల నీళ్లు లేక ఆయకట్టు రైతుల అవస్థలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
వరి వెతలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నాళ్లూ సరిపడా నీళ్లు.. అత్యధికంగా సాగైన వరిమళ్లు.. ప్రతి గ్రామంలోనూ సమయానికి సాగిన సర్కారు కొనుగోళ్లతో సాగు సస్యశ్యామలంగా సాగుతూ వచ్చింది. ఒక్కసారిగా ప్రభుత్వం యాసంగి వరి వేయొద్దని చెప్పడం, ఈ యేడాది ధాన్యమే కొనబోమని ప్రకటించడం ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకంగా 2.53లక్షల ఎకరాల్లో సాగు తగ్గించి బీడుగా వదిలేశారు. ఇదే సమయంలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు తరలించడంతో ఆ ప్రాజెక్టుల బ్యాక్‌వాటర్‌పై ఆధారపడిన వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సారెస్పీ కాలువల్లోనూ అడపాదడపా వదులుతున్న వారబందీ నీళ్లు సరిపోక చి'వరి' ఆయకట్టుల్లో సుమారు 12వేల ఎకరాలు ఎండుముఖం పడుతోంది. కనీసం వరద కాల్వలలోనూ నీళ్లు లేక దాని ఆయకట్టూ ప్రశ్నార్థకంగా మారింది. ఐదేండ్లుగా యాసంగి వరి సాగు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. పదేండ్ల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.5లక్షల ఎకరాల్లో సాగైన వరి ఏయేటికాయేడు పెరుగుతూ గత యాసంగిలో 11లక్షల ఎకరాల్లో సాగైంది. అంత పెద్ద మొత్తంలో వరి వైపు మొగ్గుచూపిన రైతులు.. ఈ ఏడాది 2.53లక్షల ఎకరాల్లో తగ్గించారు. అందులో జగిత్యాల జిల్లాలోనే అత్యధికంగా వరి విస్తీర్ణం తగ్గించారు. గతేడాది యాసంగిలో 2లక్షల 93వేల 823 ఎకరాల్లో
వరి సాగు చేసిన జగిత్యాల జిల్లా రైతులు ఈ ఏడాది లక్షా 65వేల 584 ఎకరాల్లో మాత్రమే వేశారు. లక్షా 28వేల 239 ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గించారు. ఇదే పరిస్థితి మిగతా జిల్ల్లాల్లోనూ ఉంది. కరీంనగర్ జిల్లాలో గతేడాది 2లక్షల 60వేల 172 ఎకరాల్లో వరి సాగవగా.. ఈ యాసంగిలో 2లక్షల 12వేల 443 ఎకరాల్లో తగ్గింది. అంటే సుమారు 47వేల 729 ఎకరాల్లో వరి సాగు తగ్గింది. పెద్దపల్లి జిల్లాలో గతేడాది లక్షా 91వేల 313 ఎకరాల్లో సాగవగా.. ఈ యాసంగిలో లక్షా 67వేల 239 ఎకరాల్లో సాగైంది. ఈసారి 18వేల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతేడాది లక్షా 66వేల 464 ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది లక్షా 18వేల 893 ఎకరాల్లో సాగు చేశారు. ఈ జిల్లాలో 47571 ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గించారు.
చి'వరి' మళ్లు ఎండుముఖం
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని జగిత్యాల జిల్లాలో ఈసారి 2.93 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఆయకట్టు కింద అత్యధికంగా సుమారు 2.45లక్షల ఎకరాల్లో వరి వేశార. అయితే, ప్రాజెక్టు నుంచి వారబందీ కింద నీళ్లు ఇస్తుండటంతో చివరి ఆయకట్టులోని సుమారు 12 వేల ఎకరాల్లో పైరు ఎండుతోంది. ప్రధానంగా కొడిమ్యాల, సారంగాపూర్, కథలాపూర్, మల్యాల, మేడిపల్లి మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌పై ఆధారపడిన ధర్మపురి నియోజకవర్గంలోని రాయపట్నం, ధర్మపురి, కోటిలింగాల, అటు మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ సహా వరి సాగు చేస్తున్న రైతులకు సరిపడా నీళ్లు లభించడం లేదు. ఈ యాసంగిలో అటు ఎల్లంపల్లి, ఇటు మధ్యమానేరులో నీళ్లన్నీ మల్లన్నసాగర్‌కు రిలీజ్ చేయడంతోనే ఆ రెండు ప్రాజెక్టుల్లో నీటి మట్టం తగ్గి స్థానికంగా ఉన్న కొన్ని బోరుబావులు ఒట్టిపోయాయి. దీంతో పైన చెప్పిన మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పైరు ఎండుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వదర కాల్వల ద్వారా కూడా నీటిని బంద్ చేయడంతో ఆ కాలువను ఆధారం చేసుకుని కరీంనగర్ జిల్లాలో వరి సాగవుతున్న గంగాధర, బోయిన్పల్లి మండలాల్లోని రైతులకూ సాగు నీరు అందడం లేదు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది ఎల్లంపల్లి నుంచి నీటిని బంద్ చేయడంతో లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న గంగాధర మండలంలోని బూరుగుపల్లి, చర్లపల్లి(ఆర్), ర్యాలపల్లి, కొండయ్యపల్లి, కాచిరెడ్డిపల్లి, కొడిమ్యాల మండలం నర్సింహులపల్లి, మల్యాల మండలం బలవంతపూర్ గ్రామాల్లో వరిని కాపాడుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుంటున్నారు. మరికొంత ఆ సాహసమూ చేయలేక పశువుల మేతకు వదిలేస్తున్నారు.