Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 శాతానికి పైగా రుణాలు ఇందుకోసమే...
- లక్ష్యాల పరిమితి కంటే బడ్జెటేతర రుణాలే ఎక్కువ
- ఐదేండ్లలో రూ.84,650 కోట్ల అధిక వ్యయం
- 2019-20లో కేటాయింపులు లేకుండానే రూ.2,084 కోట్లు ఖర్చు
- రూ.1,800 కోట్ల మేర పెరిగిన వడ్డీ చెల్లింపులు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన కాగ్
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక స్థితిగతులపై నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే అప్పులు చేస్తున్నామంటూ ప్రభుత్వాధినేతలు చెబుతుండగా... అందుకు భిన్నంగా చేసిన అప్పులను తిరిగి చెల్లించటానికే సర్కారు మళ్లీ మళ్లీ అప్పులు చేస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షేపించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల్లో 75 శాతానికి పైగా గతంలోని అప్పులను తిరిగి చెల్లించటానికే వినియోగించారని తేల్చి చెప్పింది. ఆస్తుల కల్పన మీద దీని ప్రభావం స్పష్టంగా కనబడిందని తేటతెల్లం చేసింది. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం ప్రకారమే రుణాలను స్వీకరిస్తున్నా... బడ్జెటేతర (మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వగైరా కార్పొరేషన్ల పేరిట తీసుకున్నవి) అప్పులను పరిగణనలోకి తీసుకుంటే అవి లక్ష్యాల పరిమితి కంటే ఎక్కువగానే ఉంటున్నాయని విశదీకరించింది. ద్రవ్యలోటులో 97 శాతాన్ని ప్రభుత్వం మార్కెట్ రుణాల ద్వారానే సమకూర్చుకుంటున్నదని వివరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020 మార్చితో ముగిసింది) సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను మంగళవారం శాసనసభ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ యేడాదిలో ఆస్తుల కల్పన మీద సర్కారు దృష్టి సారించలేదని రిపోర్టులో కాగ్ పేర్కొంది. సాగునీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటంలో జాప్యం వల్ల భారీ స్థాయిలో మూలధన నిధులు చిక్కుకుపోయారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, డిస్కాములతో చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విధంగా (ఉదరు పథకం కింద డిస్కాములకు చెందిన నష్టాలను స్వీకరింటానికి సంబంధించి) తాను చెల్లించాల్సిన రూ.4,063.65 కోట్లను తెలంగాణ ప్రభుత్వం తీర్చలేదని గుర్తు చేసింది. మరోవైపు ప్రస్తుత చెల్లింపులు.. రానున్న సంవత్సరాలకు వాయిదా పడగా, ఉదరు పథకం ద్వారా ఆశించిన విధంగా డిస్కాములను ఆర్థికంగా పటిష్ట పరచలేదని పేర్కొంది.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్న ప్రజారుణం అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే 2019-20 నాటికి 18.04 శాతానికి పెరిగిందని కాగ్ వివరించింది. సర్కారు చెల్లించాల్సి ఉన్న మొత్తం ప్రజా రుణంలో దాదాపు సగభాగాన్ని (46 శాతం) రానున్న ఏడేండ్లలో తీర్చాల్సి ఉంటుందని పేర్కొంది. చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవటానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వనరులను పెంచుకోవాలని సూచించింది. వార్షిక పద్దు పత్రాల్లో తగిన రీతిలో పొందుపరచకుండానే బడ్జెటేతర అప్పుల రూపంలో వివిధ సంస్థల నుంచి రూ.71,131.63 కోట్లను సర్కారు తీసుకున్నదని వివరించింది. 2020 మార్చి చివరి నాటికి ఈ గణాంకాలు నమోదయ్యాయని స్పష్టం చేసింది. ఇందులో కేవలం ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే రూ.16,077.04 కోట్ల అప్పులు తీసుకున్నారని తెలిపింది. వీటన్నింటినీ తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన్నే ఉందని వివరించింది. ఇలాంటి చర్యలు శాసనసభ పర్యవేక్షణ పాత్రను, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను పలుచన చేస్తాయని హెచ్చరించింది. తద్వారా కీలమైన ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పథకాలకు నిధులు, ప్రధాన వనరుల మీద శాసనసభ నియంత్రణ లేకుండా పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గత కొన్నేండ్లుగా శాసనసభ సాధికారిక ఆమోదానికి మించి రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అధిక వ్యయం చేస్తోందని కాగ్ ఆక్షేపించింది. ఇది అత్యంత ఆందోళనకరమని పేర్కొంది. ఈ విధంగా గత ఐదేండ్లలో రూ.84,650 కోట్ల మేర అధిక వ్యయం చేశారని వివరించింది. దీన్ని క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. 2019-20లో బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ.2,084.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందనీ, ఇది శాసనసభ సాధికారితను తక్కువ చేసినట్టేనని అక్షింతలేసింది. దీంతోపాటు 2021 మార్చితో ముగిసిన (2020-21) ఆర్థిక సంవత్సరానికి సైతం కాగ్ సమర్పించిన నివేదికను శాసనసభ, మండలిలో మంగళవారం ప్రవేశపెట్టారు.