Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతలో విషబీజాలు నాటితే..దేశం అధోగతే
- రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నారు..
- ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా బీజేపీ పాలన
- భిన్నత్వంలో ఏకత్వం ఏదీ?: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో మతపిచ్చిని పెంచి, కేంద్రప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఫెడరల్ విధానాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 'రాష్ట్రాలను ఉనికిని లేకుండా చేస్తాం... అణచివేస్తాం.' అని కేంద్రం బెదిరిస్తు న్నదనీ, ఇది అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఎవరైనా రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడినా.. ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడినా.. దేశ ద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు అదుపులో ఉండాలనీ, అప్పుడే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ''బెంగుళూరులో హిజాబ్ పంచాయితీ ఎందుకు? ఎవరు ఏ దుస్తులు ధరించాలో ప్రభుత్వం చెబ్తదా? ఇదో అంశంగా సృష్టించటమేంటి? ఇలాంటి మత వైషమ్యాలు పెరిగితే యువత భవిష్యత్ ద్వంసం అయితదన్న సోయి లేకపోతే ఎట్లా...'' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పెడ ధోరణులు ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. మతకలహాలు సృష్టించి, ఉన్మాద చర్యలకు దిగితే..అభివృద్ధి కుంటుపడు తుందన్నారు. ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం మీద నానా రకాల ప్రచారం చేసి, అంతకంటే బాగా పరిపాలిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం...అన్న వస్త్రాల కోసం పోతే..ఉన్న వస్త్రాలు ఊడిపాయే అన్నట్లు దాపురించిందన్నారు. మత చిచ్చు కార్చిచ్చులా ప్రజల్ని దహించి వేస్తుందని హెచ్చరిం చారు. దీనిపై బుద్ధిజీవులు, యువత ఆలోచించాలని కోరారు. ఉక్రేయిన్‌లో కర్ణాటకకు చెందిన విద్యార్థి చనిపోతే..బాధ్యతగా వ్యవహరించాల్సిన కేంద్ర మంత్రి.. తిన్నది అరక్క అక్కడికి పోయాడా?అని వ్యాఖ్యానించటం ఎంత వరకు సబబని ప్రశ్నిం చారు. ఇలాంటి వాటిపై మాట్లాడితే దేశద్రోహులని నిందిస్తు న్నారని చెప్పారు. బీజేపీ ఈ దేశంలో మతపిచ్చి పెంచడం, మూక దాడులు చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. ఆపార్టీ నేతృత్వంలోనే డబుల్ ఇంజిన్ గ్రోత్ పేరుతో కొత్త నినా దం నెత్తికెత్తుకున్నారనీ, అది ట్రబుల్ ఇంజిన్ తప్ప మరోటి కాద న్నారు. 2015లో బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిం దనీ, దానికి తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని బేరీజు వేస్తూ గణాం కాలను ఉదహరిస్తూ వివరణ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలనేదే ఈ డబుల్ ఇంజిన్ నినాదమని చెప్తూ, ఈ గ్రోత్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో తలసరి ఆదాయం రూ.71 వేలు కాగా, తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2.87 లక్షలని తెలిపారు. ఆర్థిక వద్ధి రేటు యూపీలో 7.26 శాతమైతే.. తెలంగాణ 10.8శాతం గా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎంఎంఆర్ (ప్రసూతి మరణాల సంఖ్య) 167 ఉంటే, తెలంగాణలో 56గా నమోదైం దనీ, యూపీలో శిశు మరణాల రేటు 41 అయితే తెలంగాణలో 23 అని వివరణ ఇచ్చారు. ఈ లెక్క లన్నీ కేంద్రప్రభుత్వ సంస్థలు ఇచ్చినవేనని చెప్పారు. మేకిన్ ఇండియా ఎక్కడకు పోయింద న్నారు. యూపీఏ ప్రభుత్వం కంటే బీజేపీ హయాం లో దేశం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చాక దేశంలో నిరుద్యోగం, ఆకలి కేకలు పెరిగాయనీ, ఐదు లక్షల పరిశ్రమల మూతప డ్డాయనీ, ప్రజాస్వామ్య విలువల పతనంలో ముందు పీఠిలో నిలిచిందని చెప్పారు. ఇవన్నీ తాను చేస్తున్న విమర్శలు కాదనీ, యూఎన్డీపీ, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చిన గణాంకాలేనని ఉదహరించారు.