Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైవే రోడ్డు నిర్వాసితుల ఏకగ్రీవ తీర్మానం
- నాగపూర్ టూ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రజాభిప్రాయ సేకరణ
- మధిర మండలం సిరిపురంలో స్వల్ప ఉద్రిక్తత
- పోలీస్ పహారా మధ్య అభిప్రాయ సేకరణ
- కార్పొరేట్ల కోసమే గ్రీన్‌ఫీల్డ్ హైవే : తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయ ప్రతినిధి / మధిర
నాగపూర్ టూ అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై నిర్వాసితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో భూములిచ్చేది లేదని రైతులు, నిర్వాసితులు ఏకగ్రీవంగా తీర్మానించారు. భారీ పోలీసు పహారా మధ్య ఉదయం 11 గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. పది మండలాల పరిధిలోని 24 గ్రామాల నుంచి సుమారు 300 మంది నిర్వాసితులు, తెలంగాణ రైతుసంఘం ప్రతినిధులు ఈ అభిప్రాయ సేకరణకు హాజరయ్యారు. రైతుసంఘం ప్రతినిధులు, కొందరు రైతులను లోనికి అనుమతించకపోవడంతో తోచుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తనిఖీల అనంతరం లోనికి అనుమతించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. పర్యావరణ అధికారులు ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. దీనిపై రైతులు, రైతుసంఘం ప్రతినిధులు అభ్యంతరం వెలిబుచ్చారు. రిపోర్టు సమగ్రంగా లేదని, నేషనల్ హైవే వల్ల పంట భూములు, అంతర్గత రోడ్లు, ఆస్తులు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఒక్కో రైతును పిలిచి అభిప్రాయం తెలపాల్సిందిగా అధికారులు కోరారు.
కార్పొరేట్ల కోసమే హైవేలు : పోతినేని
జాతీయ రహదారుల వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. కార్పొరేట్ సంస్థల వ్యాపారలావాదేవీల కోసం పేద ప్రజల భూములు గుంజుకునే ఆలోచన మానుకోవాలని డిమాండ్ చేశారు. కోదాడ- విజయవాడ ఆరు లైన్ల రోడ్డుకు ఈ రహదారిని అనుసంధానిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు రైతులు భూములు కోల్పోకుండా ఉంటారని తెలిపారు. సాగర్ కాలువ కింద మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి వస్తుందన్నారు. వరి, ఆరుతడి, ఉద్యాన పంటలు పండే సారవంతమైన భూములను తీసుకుంటే రైతుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. నేషనల్ హైవేల పేరుతో జిల్లాలో ఇప్పటికే వేల ఎకరాల భూములు సేకరించారని అన్నారు. రైతులకు అవగాహన ఉండదనే పేరుతో పర్యావరణ అధికారులు సమగ్ర రిపోర్టు తేకుండా కాకిలెక్కలతో రైతులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రిపోర్టు తప్పుల తడకగా ఉందని, సరైన రిపోర్టును అందించాలని డిమాండ్ చేశారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములివ్వమని రైతులు ఇచ్చిన ఏకగ్రీవ తీర్మానాన్ని అధికారులు విజ్ఞతతో యథావిధిగా ప్రభుత్వానికి పంపాలని కోరారు. రోడ్లు వద్దంటూ రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
భూములు లాక్కొని మా బతుకులు ఆగం చేయొద్దు: - తక్కెళ్లపాటి భద్రయ్య, నిర్వాసిత రైతు ప్రతినిధి
తమ జీవనాధారమైన భూములు లాక్కొని బతుకులు ఆగం చేయొద్దని నిర్వాసిత రైతు ప్రతినిధి తక్కెళ్లపాటి భద్రయ్య కోరారు. హైవేల కోసం వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా భూములను మాత్రం ఇచ్చేది లేదని తెలిపారు. వేదిక మీద ఉన్న అధికారులూ రైతు కుటుంబాల నుంచే వచ్చి ఉంటారని, రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వ్యవసాయ కార్మికసంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, జిల్లా నాయకులు ఎస్.నవీన్‌రెడ్డి, శీలం నర్సింహారావు, దివ్వెల వీరయ్య, దొండపాటి నాగేశ్వరరావు, మంద సైదులు, రామనర్సయ్య, రైతులు వేములపల్లి సుధీర్, శ్రీనివాస్, కుతుంబాక సత్యనారాయణ, ప్రతాపనేని రంగారావు, పుల్లారావు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.