Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండల్లో విద్యార్థులకు కష్టం :ప్రభుత్వానికి ఉపాధ్యాయసంఘాల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ నెలలోనే నిర్వహించాలని పలు ఉపాధ్యాయసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ పరీక్షలను మే 23 నుండి 31 వరకు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. మండు వేసవి, అధిక వేడిమి వాతావరణంలో పిల్లలు పరీక్షలకు సన్నద్ధం కావటం, పరీక్షలు వ్రాయటం కష్టమని తెలిపారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రమణ, మైస శ్రీనివాసులు, తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ నారాయణ, ఎస్ పద్మారెడ్డి, తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ రాజభానుచంద్రప్రకాష్, ఆర్ రాజగంగారెడ్డి, సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్,ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. డిసెంబర్ నెలాఖరుకే పదవ తరగతి సిలబస్ పూర్తయ్యిందనీ, సిలబస్ కూడా 70 శాతానికి కుదించినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు రివిజన్ చేయిస్తూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారనీ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పరీక్షలు ఏప్రిల్ లోనే నిర్వహించాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేట్ కళాశాలల ప్రయోజనాల కోసమే ఏకపక్షంగా పరీక్షలు వాయిదా వేశారని విమర్శించారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాతే పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలనే నిబంధన ఏదీ లేదని గుర్తుచేశారు. టెన్త్ పరీక్షలు ముందుగా నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ మే నెలాఖరుకు వాయిదా వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని ఎస్సెస్సీ పరీక్షలు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.